
'విద్యార్థులు అడిగితేనే డ్యాన్స్ చేశా'
గుంటూరు: విద్యార్థులు అడిగితేనే డ్యాన్స్ చేశానని ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలోని ఆర్కిటెక్చరు కాలేజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావు స్పష్టం చేశారు. అందులో తన తప్పేం లేదన్నారు. ఆర్కిటెక్చరు విద్యార్థి రిషితేశ్వరీ ఆత్మహత్యపై శుక్రవారం గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్ ఎదుట బాబూరావు హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో బాబూరావు మాట్లాడారు. కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.
అయితే రిషితేశ్వరి తండ్రి తనను కలవనే లేదని చెప్పారు. ఓ సారి మాత్రం ఆయన హాస్టల్కు వచ్చారని తెలిసిందన్నారు. యూనివర్శిటీలో జరిగిన ఫంక్షన్ లో విద్యార్థులతో కలసి ప్రిన్సిపాల్ బాబురావు డ్యాన్స్ చేసిన వీడియోలు మీడియాలో హల్ చల్ చేశాయి. అంతేకాకుండా కాలేజీతోపాటు హాస్టల్ లో జూనియర్స్ ను సీనియర్స్ ర్యాగింగ్ చేసిన అంతగా పట్టించుకునే వారు కాదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.