దాడిచేసిన వారిని పట్టుకుంటే లక్ష రూపాయలు!!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటీఎం సెంటర్ వద్ద జ్యోతి ఉదయ్ అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడి ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని హిందూపూర్లో బాధితురాలి సెల్ఫోన్ను నిందితుడు ఓ సెల్ రీచార్జి దుకాణంలో అమ్మేసినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు ఆ ఫోన్ కొన్న దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాను ఫోన్ కొన్నమాట వాస్తవమే గానీ, అతడి వివరాలు మాత్రం తనకు తెలియవని దుకాణదారు చెబుతున్నాడని, అతడి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారని ఔరాద్కర్ చెప్పారు.
కేసు దర్యాప్తు కోసం మొత్తం ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ సంఘటనలో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రం బయట వేచి ఉన్నాడని భావిస్తున్న మరో వ్యక్తి కోసం కూడా ఆ బృందాలు గాలిస్తున్నాయని కమిషనర్ ఔరాద్కర్ తెలిపారు. ఏటీఎం దాదాపు వారం రోజుల నుంచి పనిచేయట్లేదని, తర్వాత అది బాగుపడినా కస్టమర్లు చాలామంది అందులోకి వెళ్లడంలేదని, అలాగే ఉదయం ఏడు గంటల సమయంలో గార్డు కూడా లేడని మరో పోలీసు అధికారి చెప్పారు.
ఇక బాధితురాలు జ్యోతి ఉదయ్ (44) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమె తలపైన, ముఖం మీద, ముక్కుమీద నిందితుడు కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. జ్యోతిపై దాడిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. బ్యాంకులన్నీ తమ కస్టమర్ల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన తెలిపారు. లేనిపక్షంలో మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏటీఎం కేంద్రాలు కూడా వినియోగదారులకు బ్యాంకులు అందించే సేవా కేంద్రాలేనని , అక్కడ కూడా వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిదేనని సిద్దరామయ్య సచివాలయంలో విలేకరులతో అన్నారు.
కాగా, జ్యోతి ఉదయ్పై దాడి జరిగిన ఏటీఎం కియోస్క్ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) భవనానికి అత్యంత సమీపంలోనే ఉంది. అలాగే, ఉల్సూర్ గేట్ పోలీసు స్టేషన్కు సరిగ్గా ఫర్లాంగు దూరంలోనే ఉంది. ఇక ప్రతి బ్యాంకు ఏటీఎంలోనూ బయట కూడా తప్పనిసరిగా రెండు కెమెరాలు, లోపల అలారం ఉండాలని, అలాగే గార్డులు కూడా ఉండి తీరాలని.. ఈ నిబంధనలను 24 గంటల్లో అమలుచేయాలని కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు.