... ఆ ఘటనకు రెండేళ్లు
కొలిక్కిరాని బ్యాంకు ఉద్యోగి జ్యోతిపై దాడి కేసు
15 బృందాలు గాలించినా ఫలితం శూన్యం
బెంగళూరు: 15 ప్రత్యేక పోలీసు బృందాలు, 400 మంది పోలీసులు, ఐదు రాష్ట్రాల్లో నిఘా, దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు, ముగ్గురు నగర కమీషనర్‌ల వ్యూహ రచన ఇవేవీ ఆ నిందితుడి జాడను గుర్తించలేకపోయాయి. బెంగళూరు నగరంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్ పై ఏటీఎంలో దాడి జరిగి ఈనెల 19కు రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. అయినా ఇప్పటికీ దాడికి పాల్పడ్డ నిందితుడి జాడను మాత్రం పోలీసులు తెలుసుకోలేకపోయారు.
2013 నవంబర్ 19న నగరంలోని జేసీ రోడ్ ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్‌పై ఆగంతకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఏటీఎంలో దాడి ఘటన అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో రికార్డు కావడంతో, ఈ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ఐదు రాష్ట్రాల్లో నిఘా....
ఉద్యోగి జ్యోతి ఉదయ్‌శంకర్ పై పట్టపగలే ఏటీఎంలో జరిగిన దాడి ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడంతో నిందితుడిని పట్టుకునేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు వందల మంది పోలీసులతో 15 ప్రత్యేక పోలీసు ృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
ఏటీఎంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లలో రికార్డ్ అయిన నిందితుడిని ఫొటోలను, ఏటీఎంలో లభించిన నిందితుడి వేలి ముద్రలు తీసుకొని దాదాపు వారం రోజుల పాటు ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఈ కేసును చేధించేందుకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు మరే కేసులోనూ తాము చూడలేదన్నది పోలీసు శాఖలోని ఉన్నతస్థాయి అధికారుల వ్యాఖ్య.
ముగ్గురు కమిషనర్‌లు వ్యూహ రచన చేసినా.....
ఇక జ్యోతి ఉదయ్ శంకర్‌పై ఏటీఎంలో దాడి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు కమీషనర్‌లు ఈ కేసుకు సంబంధించి వ్యూహ రచన చేశారు. ఏటీఎంలో దాడి జరిగిన సమయంలో రాఘవేంద్ర ఔరాద్కర్ బెంగళూరు పోలీస్ కమీషనర్‌గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రత్యేక పోలీసుృబందాలు ఏర్పాటయ్యాయి.
అనంతరం ఎం.ఎన్.రెడ్డి బెంగళూరు పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎం.ఎన్.రెడ్డి సైతం ఈ కేసును తాము ఒక సవాల్‌గా తీసుకున్నామని, నిందితుడిని పట్టుకొని తీరతామని ప్రకటించారు. అయినా ఈ కేసును ఛేదించలేక పోయారు. ఇక ఎం.ఎన్.రెడ్డి అనంతరం ప్రస్తుతం మేఘరిక్ నగర పోలీస్ కమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండడం శోచనీయం.
ముఖం మార్చుకుని ఉండవచ్చా?
ఇక జ్యోతి ఉదయ్‌శంకర్‌పై దాడి అనంతరం నిందితుడి ఫొటోలు అన్ని మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో తనను సులువుగా గుర్తించేందుకు వీలుందని గ్రహించిన నిందితుడు తన ముఖాన్ని మార్చుకొని ఉండవచ్చనే దిశగా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఈ దాడి అనంతరం అతను మరే నేరానికి కూడా పాల్పడలేదని, అందువల్లే అతన్ని పట్టుకోవడం కష్టతరమైందని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఏటీఎంలో దాడి తర్వాత లభించిన నిందితుడి వేలి ముద్రలను నగర పోలీసులు అన్ని రాష్ట్రాలకు పంపించారు. అయితే ఈ ఘటన అనంతరం మరే నేర సంఘటనలోనూ నిందితుడి వేలి ముద్రలతో సరిపోలే వేలి ముద్రలు లభించలేదని, అందువల్లే అతని ఆచూకీని కనుక్కోవడం కష్టతరమవుతోందనేది పోలీసు అధికారుల వాదన. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పోలీసులను అలర్ట్ చేస్తూనే ఉన్నామని, అందువల్ల అతన్ని కచ్చితంగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.