one lakh reward
-
డ్రగ్స్ కేసు: కేసీఆర్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్దితోనూ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అకున్ సబర్వాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేసును పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించి సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా, పేకాట క్లబ్బులు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే దాని ప్రవేశమే లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుడుంబా, పేకాటలాగే డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని కేసీఆర్ వివరించారు. మరోవైపు నేటి ఉదయం నుంచి హీరో రవితేజను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. -
రాహుల్ ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్
భోపాల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విమర్శల దుమారం చెలరేగుతోంది. రాహుల్ గాంధీ ఆచూకీ తెలిపినవారికి కాంగ్రెస్ వారితో సహా ఎవరికైనా ఒక రూ. లక్ష ను ఇస్తానని బీజేపీ ఎంపీ, మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్ సిసోడియా ప్రకటించారు. రాహుల్ గాంధీకా పతా బతావో ఎక్ లాక్ రూప్యా పావో( రాహుల్ గాంధీ అచూకీ తెలపండి, లక్ష గెలుపొందండి) అని ప్రకటించారు. గతేడాది రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లినపుడు ఆయన ఎనర్జీని పొందడానికి, పార్టీ బలోపేతం కోసం మేదో మథనం చేసేందుకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అన్నారు. కానీ రాహుల్ మాత్రం మలేషియా, బ్యాంకాక్,సింగపూర్ లలో విహరించారని సిసోడియా తెలిపారు. ఇప్పుడు రాహుల్ ఎనర్జీ లెవల్స్ మళ్లీ తగ్గాయా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ ఏ దేశానికి వెళ్లారు? ఎవరిని కలుస్తారు? ఎలా రీచార్జ్ అవుతారు? అని సిసోడియా ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ బీజేపీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవి సక్సేనా అన్నారు. -
‘ఏటీఎం దుండగుడి’ ఆచూకీ ఇస్తే నజరానా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/హిందూపురం: బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ ప్రణబ్ మొహంతి గురువారం ప్రకటించారు. సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. 9480801101, 9480801011 నంబర్లకు ఫోన్, ఎస్ఎంఎస్లు ద్వారా సమాచారాన్ని ఇవ్వవచ్చని వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు జ్యోతి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని చీఫ్ న్యూరో సర్జన్ ఎన్కే. వెంకట రమణ చెప్పారు. సెల్‌ఫోన్ హిందూపురంలో విక్రయం: దుండగుడు దాడి చేసిన తర్వాత కాజేసిన సెల్‌ఫోన్‌ను హిందూపురంలో విక్రయించగా కర్ణాటక పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం దాడి చేసిన దుండగుడు అదే రోజు సాయంత్రం హిందూపురానికి వచ్చాడు. అక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉన్న ఒక సెల్‌ఫోన్ దుకాణంలోకి వెళ్లి తాను బెంగళూరు నుంచి వచ్చానని, పర్సు పోయిందని, చార్జీలకు డబ్బు లేదని సెల్‌ఫోన్ తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు. సెల్‌ఫోన్ దుకాణదారుడు అబూజర్.. ఆ నోకియా 2700 మోడల్ సెల్‌ఫోన్‌కు రూ.800 ఇస్తాననడంతో అతడికి విక్రయించాడు. అబూజర్ బుధవారం ఆ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన కర్ణాటక పోలీసులు వెంటనే హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత అబూజర్‌ను బెంగళూరు నుంచి వచ్చిన పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. అతడితో బాటు మరో ఇద్దరిని కర్ణాటక తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుడిని గుర్తించామని అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కర్ణాటక డీజీపీ తెలిపారు. కాగా, సెల్‌ఫోన్‌ను కర్ణాటక పోలీసులకు అప్పగించామని, అబూజర్‌ను వారే విచారిస్తున్నారని హిందూపురం సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
దాడిచేసిన వారిని పట్టుకుంటే లక్ష రూపాయలు!!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటీఎం సెంటర్ వద్ద జ్యోతి ఉదయ్ అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడి ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని హిందూపూర్‌లో బాధితురాలి సెల్‌ఫోన్‌ను నిందితుడు ఓ సెల్ రీచార్జి దుకాణంలో అమ్మేసినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు ఆ ఫోన్ కొన్న దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాను ఫోన్ కొన్నమాట వాస్తవమే గానీ, అతడి వివరాలు మాత్రం తనకు తెలియవని దుకాణదారు చెబుతున్నాడని, అతడి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారని ఔరాద్కర్ చెప్పారు. కేసు దర్యాప్తు కోసం మొత్తం ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించామని, ఈ సంఘటనలో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రం బయట వేచి ఉన్నాడని భావిస్తున్న మరో వ్యక్తి కోసం కూడా ఆ బృందాలు గాలిస్తున్నాయని కమిషనర్ ఔరాద్కర్ తెలిపారు. ఏటీఎం దాదాపు వారం రోజుల నుంచి పనిచేయట్లేదని, తర్వాత అది బాగుపడినా కస్టమర్లు చాలామంది అందులోకి వెళ్లడంలేదని, అలాగే ఉదయం ఏడు గంటల సమయంలో గార్డు కూడా లేడని మరో పోలీసు అధికారి చెప్పారు. ఇక బాధితురాలు జ్యోతి ఉదయ్ (44) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆమె తలపైన, ముఖం మీద, ముక్కుమీద నిందితుడు కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. జ్యోతిపై దాడిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. బ్యాంకులన్నీ తమ కస్టమర్ల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన తెలిపారు. లేనిపక్షంలో మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏటీఎం కేంద్రాలు కూడా వినియోగదారులకు బ్యాంకులు అందించే సేవా కేంద్రాలేనని , అక్కడ కూడా వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిదేనని సిద్దరామయ్య సచివాలయంలో విలేకరులతో అన్నారు. కాగా, జ్యోతి ఉదయ్‌పై దాడి జరిగిన ఏటీఎం కియోస్క్ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) భవనానికి అత్యంత సమీపంలోనే ఉంది. అలాగే, ఉల్సూర్ గేట్ పోలీసు స్టేషన్‌కు సరిగ్గా ఫర్లాంగు దూరంలోనే ఉంది. ఇక ప్రతి బ్యాంకు ఏటీఎంలోనూ బయట కూడా తప్పనిసరిగా రెండు కెమెరాలు, లోపల అలారం ఉండాలని, అలాగే గార్డులు కూడా ఉండి తీరాలని.. ఈ నిబంధనలను 24 గంటల్లో అమలుచేయాలని కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు.