సాక్షి ప్రతినిధి, బెంగళూరు/హిందూపురం: బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ ప్రణబ్ మొహంతి గురువారం ప్రకటించారు. సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. 9480801101, 9480801011 నంబర్లకు ఫోన్, ఎస్‌ఎంఎస్‌లు ద్వారా సమాచారాన్ని ఇవ్వవచ్చని వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు జ్యోతి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని చీఫ్ న్యూరో సర్జన్ ఎన్‌కే. వెంకట రమణ చెప్పారు.
సెల్‌ఫోన్ హిందూపురంలో విక్రయం: దుండగుడు దాడి చేసిన తర్వాత కాజేసిన సెల్‌ఫోన్‌ను హిందూపురంలో విక్రయించగా కర్ణాటక పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం దాడి చేసిన దుండగుడు అదే రోజు సాయంత్రం హిందూపురానికి వచ్చాడు. అక్కడ అంబేద్కర్ సర్కిల్‌లో ఉన్న ఒక సెల్‌ఫోన్ దుకాణంలోకి వెళ్లి తాను బెంగళూరు నుంచి వచ్చానని, పర్సు పోయిందని, చార్జీలకు డబ్బు లేదని సెల్‌ఫోన్ తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు. సెల్‌ఫోన్ దుకాణదారుడు అబూజర్.. ఆ నోకియా 2700 మోడల్ సెల్‌ఫోన్‌కు రూ.800 ఇస్తాననడంతో అతడికి విక్రయించాడు. అబూజర్ బుధవారం ఆ సెల్‌ఫోన్లో సిమ్‌కార్డు వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన కర్ణాటక పోలీసులు వెంటనే హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత అబూజర్‌ను బెంగళూరు నుంచి వచ్చిన పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. అతడితో బాటు మరో ఇద్దరిని కర్ణాటక తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుడిని గుర్తించామని అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కర్ణాటక డీజీపీ తెలిపారు. కాగా, సెల్‌ఫోన్‌ను కర్ణాటక పోలీసులకు అప్పగించామని, అబూజర్‌ను వారే విచారిస్తున్నారని హిందూపురం సీఐ శ్రీనివాసులు తెలిపారు.
‘ఏటీఎం దుండగుడి’ ఆచూకీ ఇస్తే నజరానా
Published Fri, Nov 22 2013 12:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement
Advertisement