వాయిస్ గుర్తింపుతో మొబైల్ బ్యాంకింగ్
మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? అయితే ఆ ప్రక్రియ మరింత సులభతరం కానుందట. ఎవరైతే తరుచూ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారో, వారి ధృవీకరణను వేగవంతంగా చేపట్టడానికి వాయిస్ గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ఆవిష్కరిస్తున్నాయి. కార్డును యూజర్లు కోల్పోయినప్పుడు, లేదా కార్డు దొంగతనం జరిగినప్పుడు వినియోగదారులకు అత్యవసర వినియోగం కోసం ఈ ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ప్రారంభిస్తున్నాయి. ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా బ్యాంకు, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించేశాయి.
కస్టమర్ ధృవీకరణ సులభతరం కోసం, ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని 3 మిలియన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది మరో మిలియన్ వినియోగదారులకు ఈ ప్రక్రియను ఆవిష్కరించాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అకౌంట్ నెంబర్ లేదా కార్డు నెంబర్ టైపు చేయడం, అనంతరం టీ-పిన్, డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు సీవీవీ నెంబర్ ఇలా నమోదుచేసే ప్రక్రియంతా కొంత గందరగోళానికి దోహదం చేసే అవకాశం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు.
ఫింగర్ ఫ్రింట్ ధృవీకరణ కంటే వ్యక్తి స్వరం మరింత యూనిక్ గా ఉంటుందని పేర్కొన్నారు. వాయిస్ ధృవీకరణతో మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని సభర్వాల్ చెప్పారు. మరోవైపు కొటక్ మహింద్రా బ్యాంకు సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అయితే వాయిస్ ధృవీకరణ ఒక్కటే పూర్తి మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియలకు పూర్తి రక్షణ కల్పించదని డేటా సెక్యురిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.