voice recognition
-
ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు..
పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ! -
ఇక రోబో రూపంలో ‘అలెక్సా’
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్ కంపెనీకి చెందిన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రస్తుతం అందిస్తున్న సేవలు గురించి తెల్సిందే. గూగుల్ అసిస్టెంట్ తరహాలో ‘వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’తో పనిచేసే అలెక్సా మనకు నచ్చిన పాటను ఇంటర్నెట్ నుంచి వెతికి వినిపించడమే కాకుండా ఆటోమేషన్ ద్వారా మన ఇంట్లోని టీవీలను, ఫ్యాన్లను, లైట్లను కంట్రోల్ చేస్తోంది. మన కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అలెక్సాకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా టీవీలు, ఫ్యాన్లు, లైట్లను ఆన్, ఆఫ్ చేయవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో అమెజాన్ కంపెనీ మన నడుము ఎత్తుగల అలెక్సా రోబోను తయారు చేస్తోందని, దీనికి ఇంజనీర్ల సాయం కూడా తీసుకుంటోందని ‘బ్లూమ్‌బెర్గ్ డాట్ కామ్’ వెబ్సైట్ వెల్లడించింది. దీనికి ‘వెస్టా’ అని కూడా నామకరణం చేసిందట. దీనికి వీల్స్ మీద ప్రయాణించే సౌదుపాయం ఉంటుంది. వాయిస్ కమాండ్ ద్వారా అది ఎక్కడ ఉన్న దాన్ని మన దగ్గరికి పిలుచుకోవచ్చు. అంటే ఇంటి ముందుకు, పెరట్లోకి దాని పిలిపించుకొని దాని సేవలు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరచేతిలో అమరే ‘అలెక్సా’ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు నడుము ఎత్తు రోబోను తయారు చేయడం అన్న ప్రశ్న కూడా వినియోగదారులకు తలెత్తుతోంది. ఒక్క వాయిస్ కమాండ్స్ ఇచ్చినప్పుడే కాకుండా ఇంట్లో మనం మాట్లాడుకునే ప్రతి మాటను అలెక్సా లాంటి వాయిస్ అసిస్టెంట్లు రికార్డు చేస్తున్నాయని, వాటి వల్ల ఇంట్లోని మనుషులకు ప్రైవసీ లేకుండా పోతోందని తాజాగా వెల్లడయిన నేపథ్యంలో ఇంట్లో తిరుగాడే ‘వెస్టా’ వేస్టేగదా! అంటున్న వారు లేకపోలేదు. అలెక్సాను రోబో స్థాయికి తీసుకెళ్లినప్పుడు అందులో వేరే విశేషాలు ఏవో ఉండనే ఉంటాయని ‘అమెజాన్’ వినియోగదారులు ఆశిస్తున్నారు. -
వాయిస్ గుర్తింపుతో మొబైల్ బ్యాంకింగ్
మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా..? అయితే ఆ ప్రక్రియ మరింత సులభతరం కానుందట. ఎవరైతే తరుచూ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారో, వారి ధృవీకరణను వేగవంతంగా చేపట్టడానికి వాయిస్ గుర్తింపు ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ఆవిష్కరిస్తున్నాయి. కార్డును యూజర్లు కోల్పోయినప్పుడు, లేదా కార్డు దొంగతనం జరిగినప్పుడు వినియోగదారులకు అత్యవసర వినియోగం కోసం ఈ ప్రక్రియను ప్రైవేట్ బ్యాంకులు ప్రారంభిస్తున్నాయి. ఐసీఐసీఐ, కొటక్ మహింద్రా బ్యాంకు, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించేశాయి. కస్టమర్ ధృవీకరణ సులభతరం కోసం, ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని 3 మిలియన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది మరో మిలియన్ వినియోగదారులకు ఈ ప్రక్రియను ఆవిష్కరించాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అకౌంట్ నెంబర్ లేదా కార్డు నెంబర్ టైపు చేయడం, అనంతరం టీ-పిన్, డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు సీవీవీ నెంబర్ ఇలా నమోదుచేసే ప్రక్రియంతా కొంత గందరగోళానికి దోహదం చేసే అవకాశం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు. ఫింగర్ ఫ్రింట్ ధృవీకరణ కంటే వ్యక్తి స్వరం మరింత యూనిక్ గా ఉంటుందని పేర్కొన్నారు. వాయిస్ ధృవీకరణతో మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని సభర్వాల్ చెప్పారు. మరోవైపు కొటక్ మహింద్రా బ్యాంకు సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అయితే వాయిస్ ధృవీకరణ ఒక్కటే పూర్తి మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియలకు పూర్తి రక్షణ కల్పించదని డేటా సెక్యురిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.