సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్ కంపెనీకి చెందిన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రస్తుతం అందిస్తున్న సేవలు గురించి తెల్సిందే. గూగుల్ అసిస్టెంట్ తరహాలో ‘వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’తో పనిచేసే అలెక్సా మనకు నచ్చిన పాటను ఇంటర్నెట్ నుంచి వెతికి వినిపించడమే కాకుండా ఆటోమేషన్ ద్వారా మన ఇంట్లోని టీవీలను, ఫ్యాన్లను, లైట్లను కంట్రోల్ చేస్తోంది. మన కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అలెక్సాకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా టీవీలు, ఫ్యాన్లు, లైట్లను ఆన్, ఆఫ్ చేయవచ్చు.
ఇప్పుడు ఇదే తరహాలో అమెజాన్ కంపెనీ మన నడుము ఎత్తుగల అలెక్సా రోబోను తయారు చేస్తోందని, దీనికి ఇంజనీర్ల సాయం కూడా తీసుకుంటోందని ‘బ్లూమ్‌బెర్గ్ డాట్ కామ్’ వెబ్‌సైట్ వెల్లడించింది. దీనికి ‘వెస్టా’ అని కూడా నామకరణం చేసిందట. దీనికి వీల్స్ మీద ప్రయాణించే సౌదుపాయం ఉంటుంది. వాయిస్ కమాండ్ ద్వారా అది ఎక్కడ ఉన్న దాన్ని మన దగ్గరికి పిలుచుకోవచ్చు. అంటే ఇంటి ముందుకు, పెరట్లోకి దాని పిలిపించుకొని దాని సేవలు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అరచేతిలో అమరే ‘అలెక్సా’ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు నడుము ఎత్తు రోబోను తయారు చేయడం అన్న ప్రశ్న కూడా వినియోగదారులకు తలెత్తుతోంది. ఒక్క వాయిస్ కమాండ్స్ ఇచ్చినప్పుడే కాకుండా ఇంట్లో మనం మాట్లాడుకునే ప్రతి మాటను అలెక్సా లాంటి వాయిస్ అసిస్టెంట్లు రికార్డు చేస్తున్నాయని, వాటి వల్ల ఇంట్లోని మనుషులకు ప్రైవసీ లేకుండా పోతోందని తాజాగా వెల్లడయిన నేపథ్యంలో ఇంట్లో తిరుగాడే ‘వెస్టా’ వేస్టేగదా! అంటున్న వారు లేకపోలేదు. అలెక్సాను రోబో స్థాయికి తీసుకెళ్లినప్పుడు అందులో వేరే విశేషాలు ఏవో ఉండనే ఉంటాయని ‘అమెజాన్’ వినియోగదారులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment