పెళ్లి వేడుకల్లోనూ ‘నోట్ల’ కల్లోలమే!
-
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందిపడ్డ ప్రజలు
-
తెలుగురాష్ట్రాల్లో బుధవారం వేలల్లో పెళ్లివేడుకలు
-
ఏ వేడుకలో చూసినా ఇదే చర్చ
పెద్దనోట్ల రద్దు ప్రభావం తెలుగురాష్ట్రాల్లో పెద్దస్థాయిలోనే కనిపించింది. ముఖ్యంగా కార్తిక మాసం కావడం మంచి ముహూర్తాలు ఉండటంతో బుధవారం రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పెళ్లిల్లు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దు నిర్ణయం అనుకోని పిడుగులా మారింది. చాలా పెళ్లి వేడుకల్లోనూ పెద్ద నోట్ల రద్దుపైనా ఎక్కువగా చర్చ కనిపించింది. పెళ్లిల్లో ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనా చర్చించుకున్నారు. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలన్న ఆందోళన చాలామందిలో కనిపించింది.
అట్టహాసంగా పెళ్లి వేడుకలు చేయాలనుకున్న పెళ్లి పెద్దలపై పెద్దనోట్ల రద్దు బాగానే ప్రభావం చూపింది. పెళ్లిళ్ల కోసం అప్పో-సప్పో చేసి తెచ్చిన నగదమొత్తమంతా పెద్దనోట్ల రూపంలో ఉండటంతో వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక ఆడపిల్ల తల్లీతండ్రులు ఆందోళన చెందారు. పెళ్లిల సందర్భంగా ఇక వరుడి తరఫున, వధువు తరఫున బంధుమిత్రులు కట్నకానుకలు సమర్పించుకోవడం సాధారణంగా జరిగే రివాజు. పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని పెళ్లిల్లో ఈ తంతు జరగలేదని తెలుస్తోంది. ఇక చాలామంది బంధువులు కవర్లలో పెద్దనోట్లు పెట్టి కట్నకానుకలు చదివించుకొని మమ అనిపించారు.
మొత్తానికి పెళ్లిళ్ల వేడుకపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేస్తే తప్ప పెళ్లి వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం సాధ్యం కాదు. ఇందుకోసం పెద్దమొత్తంలో సమీకరించిన నగదు మొత్తం పెద్దనోట్ల రూపంలో ఉండటంతో పెళ్లి పెద్దల కుటుంబాల్లో ఒకరకమైన ఆందోళన కనిపించింది. ఈ పెళ్లి వేడుకలకు బయలుదేరిన బంధుమిత్రులను కూడా అవసరమైన చిల్లర నగదు అందుబాటులో లేకపోవడం, పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూలు ఉండటం, చిల్లర నగదు లేకపోవడం వల్ల బస్సు, రైలు ప్రయాణాలు వీలుకాకపోవడం ఇబ్బందులకు గురిచేశాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు గుమిగూడినా పెద్దనోట్ల రద్దుపైనా మాట్లాడుకోవడం కనిపించింది. పెళ్లి వేడుకల్లో వధూవరుల గురించి ముచ్చటించుకోవడం కన్నా ఈ పెద్దనోట్ల గండాన్ని ఎలా తప్పించుకోవడం అన్నదానిపైనా ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాలు చర్చించుకున్నాయి.
ఇక దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు, నిరుపేదలపై ఇంకా ఎక్కువ ప్రభావమే ఇది చూపింది. తమ వద్ద ఉన్న ఒకటి, రెండు పెద్దనోట్లను అప్పటికప్పుడు మార్చుకొని వినియోగిస్తే తప్ప పూట గడవని పరిస్థితి వారిది. దీంతో చాలామంది నిరుపేదలు తమ వద్ద ఉన్న పెద్దనోట్లు చెలామణి కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. పైసలు చేతిలో ఉన్నా పూట గడవని పరిస్థితి ఎదుర్కొన్నారు. హోటళ్లు, క్యాంటీన్లు, టీస్టాళ్లలో పెద్దనోట్లు తీసుకోకపోవడం, తగినంత చిల్లర లేకపోవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, రోగులు, బీపీ పేషంట్లను సైతం తగినంత చిల్లర నగదు లేకపోవడం, పెద్దనోట్లు చెలామణి కాకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పెద్ద నోట్ల రద్దుతో తెలుగురాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలైన కొనుగోలు-అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయి.. ఒకరకమైన స్తబ్దత వాతావరణం నెలకొన్నదని నిపుణులు చెప్తున్నారు.