ఈసారి సిటీలో బతుకమ్మ ప్రత్యేకతలివే..!
- ఓనం తరహాలో ఘనంగా వేడుకలు
కవాడిగూడ (హైదరాబాద్ సిటీ): తెలంగాణ సాంస్కృతిక వైభవం, రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఈసారి కూడా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కేరళ సంప్రదాయ పండుగ ఓనం తరహాలో ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ వేడుకను గొప్పగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే ఈ వేడుకల ఏర్పాట్లను ఆయన గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గొప్ప పేరుందని, అందుకు తగినవిధంగానే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సంబురాలను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో గణేష్, బక్రీద్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని, అదేవిధంగా బతుకమ్మ పండుగను సైతం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈసారి వర్షాలు పుష్కలంగా పడినందున ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చేపట్టేందుకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య సమస్య రాకుండా సానిటేషన్ సిబ్బంది టీమ్‌లు పనిచేస్తాయన్నారు. రహదారికి ఇరుపైపులా ప్రత్కేక లైటింగ్‌ను, మంచినీటి సౌకర్యం అందిస్తామన్నారు. 'స్వచ్ఛ భారత్- స్వచ్ఛ హైదరాబాద్'లో భాగంగా మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. మహిళల రక్షణ కోసం నిఘా సిబ్బందితో పోలీసులు ప్రత్కేక భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. టూరిజం శాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా నిర్వహించే బతుకమ్మ సంబురాలలో ప్రజలు సంతోషంగా పాల్గొనాలని ఆయన కోరారు.