* బీసీ సంఘ నేతలతో కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీల నుంచి తీర్మానాలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజికన్యాయ, సాధికారిత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానాలు అందలేదని వారు స్పష్టీకరించారు.
ఇతర రాష్ట్రాల అసెంబ్లీల నుంచి కూడా తీర్మానాలు వస్తే రాజకీయంగా బీసీలకు బలం పెరుగుతుందని, ఈ విషయంలో బీసీ సంఘాలే చొరవ తీసుకోవాలని ఆ నేతల బృందానికి మంత్రులు సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, అనంతకుమార్‌లతో సమావేశమయ్యారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం సహా బీసీలకు సంబంధించిన 15 డిమాండ్లను మంత్రులకు కృష్ణయ్య వివరించి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారం చేపట్టి ఆరునెలలే అయ్యిందని, దశలవారీగా బీసీల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మిన్‌రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ అనుబంధ సంఘాల నేతలు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్‌పై తీర్మానాలు వస్తే పరిశీలిస్తాం
Published Sat, Dec 20 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement