సాక్షి, హైదరాబాద్: చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకొనే ముందు.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనే జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. వేదికకు చెందిన మరో నేత వి.లక్ష్మణరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి సీమాంధ్ర వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర అడిగినప్పుడు ఇవ్వలేదు.
తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉండాలని అప్పట్లో ఢిల్లీ పెద్దలు చెప్పారు. ఇప్పుడు మాత్రం సీమాంధ్ర ప్రజలు అడగకపోయినా రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజలు అంగీకరిస్తే మంచిదే! కానీ ఒప్పుకోవడం లేదు. కలిసి ఉంటామంటే.. వెళ్లి పొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఎంత వరకు సమంజసం?’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. ప్రజల మధ్య సాధారణంగా విద్వేషాలు ఉండవని కొందరు స్వార్థపరుల వల్లే విద్వేషాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసులకు సూచించారు.
సీఎం చొరవ చూపి అసెంబ్లీని సమావేశపరచాలి
‘సీమాంధ్రలో వ్యతిరేకత రావడంతో తెలంగాణపై 2009 డిసెంబర్ ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుని శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇరు ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాలతో మాట్లాడి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నివేదికపై శాసనసభలో కూలంకషంగా చర్చించి రాజకీయాలను పక్కనబెట్టి విప్‌లు లేకుండా తీర్మానం చేయాలి’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకొని శాసనసభను సమావేశపరచాలని సూచించారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉన్నందున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
3 నుంచి సీమాంధ్రలో సదస్సులు
రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలు, కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో, 5న గుంటూరులో, 7న విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సదస్సుల్లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు లక్ష్మణరెడ్డితోపాటు టి.గోపాలకృష్ణ, మాజీ వీసీ వేణుగోపాలరెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్, రైతు నేతలు అక్కినేని భవానీప్రసాద్, ఎర్నేని నాగేంద్రనాథ్, ప్రొఫెసర్లు శామ్యూల్, రామకృష్ణరాజు, వీరభద్రారెడ్డితో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోనూ సదస్సు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు.
టీడీపీ లేఖ వెనక్కి తీసుకోవాలి
రాష్ట్రంలో సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ సీపీ.. మూడు పార్టీలే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాయని వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టీడీపీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్ మాదిరిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు.
వద్దంటున్నా.. విభజనా ? : పి.లక్ష్మణరెడ్డి
Published Thu, Sep 26 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement