
ఒళ్లు దగ్గర పెట్టుకో...లేదంటే
దేశంలోని రెండవ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అత్యుత్సాహంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ కు మరో గట్టి షాక్ తగిలింది. స్వయానా విదేశాంగ మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోకపోవడంపై తీవ‍్ర అగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా దేశంలోని రెండవ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అత్యుత్సాహంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మండిపడ్డారు. భారత గౌరవ చిహ్నాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని అమెజాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత చిహ్నాలు, చిహ్నాలను గురించి వాచాలత్వాన్ని ప్రదర్శించడాన్ని ఒక భారతీయుడిగా సహించలేక పోతున్నానంటూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భారత జాతీయ పతాకంతో కూడిన డోర్ మేట్స్ .. ఇప్పుడు గాంధీ బొమ్మలు ముద్రించిన చెప్పులు విక్రయంపై ఆయన స్పందించారు. మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది.. లేదంటే ప్రమాదం తప్పదంటూ వరుస ట్వీట్లలో హెచ్చరించారు.
అమెజాన్ భారతదేశ గుర్తులు, ఐకాన్స్ పట్ల అలక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఇది సరైందని కాదని వ్యాఖ్యానించారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే అమేజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టు అవుతుందనీ.. హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ను ప్రశ్నించినపుడు.. డోర్ మేట్స్ వ్యవహారంపై వాషింగ్టన్ లోని భారత రాయబారి ద్వారా అమెజాన్ కు మన నిరసనను తెలియజేయాలని సూచించామన్నారు. భారతీయుల సెంటిమెంట్ ను, మనోభావాలను గౌరవించాలని ఆదేశించినట్టు తెలిపారు.
కాగా హిందూ దేవతల బొమ్మలతో కూడిన డోర్ మేట్స్ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అమెజాన్ సంస్థకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తక్షణమే వాటి విక్రయాలను నిలిపివేసి భారత్ కు క్షమాపణ చెప్పాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే అమేజాన్ ప్రతినిధులకు వీసాలు కూడా ఇవ్వమని తేల్చిచెప్పారామె. దాంతో అమేజాన్ ఇండియా ప్రతినిధి దిగి వచ్చి క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే.
Amazon,better behave. Desist from being flippant about Indian symbols & icons. Indifference will be at your own peril.
— Shaktikanta Das (@DasShaktikanta) January 15, 2017