ఎమ్మెల్యే బాలకృష్ణ నిజంగా ‘తేడా’ కాదుగా! | being a MLA how Balakrishna promotes liqueur | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బాలకృష్ణ నిజంగా ‘తేడా’ కాదుగా!

Published Tue, Aug 29 2017 4:23 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

ఎమ్మెల్యే బాలకృష్ణ నిజంగా ‘తేడా’ కాదుగా! - Sakshi

ఎమ్మెల్యే బాలకృష్ణ నిజంగా ‘తేడా’ కాదుగా!

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నా పేరు తేడా.. దిమాక్‌ థోడా.. చాలా తేడా..’’ అంటూ ‘పైసా వసూల్‌’  ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ చాలా మందిని ఆకట్టుకుంది. అదే ఊపులో ఈ సినిమా కోసం హీరోగారు పాడిన ‘మావా.. ఎక్‌ పెగ్‌ లా..’ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. అంతే, ఎన్బీకే అభిమానులకు ‘101 ఫీవర్‌’ పుట్టుకొచ్చింది. వీడియోలో బాలకృష్ణ.. హీరోయిన్‌కు బలవంతంగా మందు తాగించినట్లే ఆయన ఫ్యాన్స్‌ వేల మంది డబ్‌స్మాష్‌ వీడియోలు చేసి ఇంటర్నెట్‌లోకి వదులుతున్నారు.

దీన్నిబట్టి, ‘సినిమా అనేది పార్టీలకు, ఫ్యాన్స్‌కు అతీతం’ అని ‘పైసా వసూల్‌’ ఆడియో వేడుకలో  హీరోగారు గొప్పగా చెప్పిన మాటను అభిమానులు ‘తేడా’గా అర్థం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక రెండో మాటగా ఆయన.. ‘‘నేనెప్పుడూ నా ప్రేక్షకులను, నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను’ అని చెప్పారు. అంటే 'మామ పెగ్ లా' అని బాలయ్య తన అభిమానులను ఉద్దేశించే చెప్పాడా..?

టాలీవుడ్‌లో అందరు హీరోలకు లేనిది, తనకు మాత్రమే ఉన్నది ‘ఎమ్మెల్యే పదవి’ అన్న విషయం బాలకృష్ణకు గుర్తుంటే అసలీ ‘మావా పెగ్‌ లా’ పాట పుట్టుకొచ్చేదేకాదు!

సినిమాటోగ్రఫీ చట్టం సెక్షన్‌ 5బీ(2) ప్రకారం సినిమాల్లో ఎక్కడా మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు ఉండకూడదు. సమాజంలోని చాలా మందిపై నటీనటుల ప్రభావం ఉంటుందికాబట్టి.. వారంతా సమాజం పట్ల కాస్తయినా స్పృహ కలిగినవారై ఉండాలనే భావన ఎప్పటినుంచో ఉన్నదే. సినిమాల్లో లిక్కర్ సీన్లు తప్పనిసరైతే, దానికి ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇస్తారు. అప్పుడు కూడా మద్యం బాటిళ్లను అస్పష్టంగా చూపాలి. కానీ, బాలకృష్ణ మందు తాగుతూ, అందులో బొర్లాడుతూ, పక్కనున్న మహిళలకు బలవంతంగా తాగిస్తూ కనిపించిన సీన్లుండే ‘పైసా వసూల్‌’కు సెన్సార్‌బోర్డు సింగిల్‌ కట్‌ చెప్పకుండా ‘యూ/ఏ’ సర్టిఫకేట్‌ జారీచేసింది.

నిబంధనల సంగతి అలా వుంచితే ఒక శాసనసభ్యుడిగా బాలకృష్ణ ఇలాంటి పాటలు పాడొచ్చా? ఇలాంటి తాగుబోతు సీన్లలో విచ్చలవిడిగా నటించవచ్చా?అది సమర్థనీయమేనా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చౌక’బారు’ పాటపై బాలయ్యతోపాటు సెన్సార్ బోర్డు కూడా సమాధానం చెప్పాలి. ఏపీలో మద్యంషాపులపై దాడులు చేస్తూ లిక్కర్‌ని నిషేధించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలకు కూడా ఎమ్మెల్యే బాలయ్య సంజాయిషీ ఇవ్వాలి. ఈ మధ్య ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్.. బీర్‌ ఒక హెల్త్ డ్రింక్ అనీ, దానిని బాగా ప్రమోట్ చేస్తామనీ చెప్పారు. బాలయ్య పాట తీరు తీస్తే ఏపీ ప్రభుత్వం పాలసీ ఇదేనేమో అనిపించకమానదు.

నిజమైన విలన్లు హీరోలే..!
‘‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో కొత్త డేటా ప్రకారం దేశంలో 96 నిమిషాలకు ఒక్కరు చొప్పున రోజుకు 15 మంది మద్యం వ్యసనం వల్ల చనిపోతున్నారు. oecd రిపోర్ట్‌ ప్రకారం మద్యం వల్ల ఆరోగ్యాన్ని నష్టపోతున్న దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఆరోగ్యం సంగతి వదిలేస్తే భారతదేశపు దారిద్య్రానికి అతి ముఖ్య కారణం మద్యపాన వ్యసనం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మద్యపానం గృహ హింసకూ మొదటి కారణమన్న సంగతి ఏ మహిళను అడిగినా తెలుస్తుంది’’ అని ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్‌.. ‘కాటమరాయుడు’ సినిమాలో తాగుబోతు పాట పెట్టడాన్ని ప్రశ్నిస్తూ కొద్ది రోజుల కిందట ఒక వ్యాసం రాశారు.

‘‘ఈ హెచ్చుతగ్గుల సమాజంలో అభివృద్ధి లేని తమ జీవితపు విసుగునుంచి బయటపడటానికి, పేదలు ఏ బెల్టు షాపులోనో చేరి దుక్కాన్ని దించుకోవాలనుకుని జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వారిని మత్తులో ముంచి వారి రెక్కల కష్టాన్ని దుర్మార్గంగా దోచుకుంటుంది. అధికారంలో ఉండటం అంటే ఒక్క రాజకీయాధికారమే కాదు. సాంస్కృతిక రంగంలో అధికార స్థానంలో ఉన్న సినిమా హీరోలు ఈ పాటని వద్దని చెప్పగలిగే వారే, కానీ వారు అలా అనుకోలేదు’’  అన్న రచయిత్రి ముక్తాయింపు వ్యాఖ్యలు.. ‘‘నిజమైన విలన్లు హీరోలే..!’’  అనే శీర్శికను బలపరుస్తారు.

ఏది రియల్‌?: రీల్‌ లైఫ్‌లో నందమూరి బాలకృష్ణ ‘తేడా సింగ్‌’ కావచ్చు. కానీ రియల్‌ లైఫ్‌లో ఆయన బాధ్యతకలిగిన ప్రజాప్రతినిధి.. గౌరవశాసన సభ్యుడు.. ‘తేడా’ కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement