ఇన్ఫీలో మళ్లీ మూర్తి మేజిక్! | Best of luck to those who left Infosys: N R Narayana Murthy | Sakshi
Sakshi News home page

ఇన్ఫీలో మళ్లీ మూర్తి మేజిక్!

Published Sat, Jan 11 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

ఇన్ఫీలో మళ్లీ మూర్తి మేజిక్!

ఇన్ఫీలో మళ్లీ మూర్తి మేజిక్!

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ‘నారాయణ’ మంత్రం బాగానే పనిచేస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నారాయణ మూర్తి పునరాగమనం తర్వాత ఇన్ఫీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. అంతేకాక.. ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) రెండోసారి పెంచడం దీనికి తార్కాణమని విశ్లేషకులు అంటున్నారు. మూర్తి పగ్గాలు చేపట్టాక 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటం... ఒకరకంగా షాక్‌గు గురిచేసినా.. ఫలితాలపై దీని ప్రభావం ఏమాత్రం లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా... ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇన్ఫీ షేరు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఆల్‌టైమ్ గరిష్టస్థాయిలోనే కొనసాగుతుండటం కూడా నారాయణ మూర్తి పునరాగమన శుభసూచకమేనన్న వాదనలకు బలం చేకూరుస్తోంది.
 
 మైసూర్: ఐటీ అగ్రగామి ఇన్ఫోసిస్ అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్(2013-14, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 21.4 శాతం వృద్దితో రూ.2,875 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 2,369 కోట్లుగా నమోదైంది. మరోపక్క, మొత్తం ఆదాయం కూడా రూ. 13,026 కోట్లకు పెరిగింది. గత క్యూ3లో రూ. 10,424 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా అ మెరికాలో ఆర్థిక వ్యవస్థ రికవరీతో ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకుంటుండటం.. యూరప్‌లో ఆఫ్‌షోర్ అవుట్‌సోర్సింగ్‌పై పెరుగుతున్న ఆసక్తితో దేశీ ఐటీ కంపెనీలకు కొలిసొచ్చే అంశంగా నిలుస్తోంది. మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువ భారీ పతనం కూడా ఆదాయాల్లో వృద్ధికి తోడ్పాటునందిస్తున్న అంశాల్లో ఒకటి.
 
 సీక్వెన్షియల్‌గా కూడా...
 2013-14 సెప్టెంబర్(క్యూ2)తో పోలిస్తే... సీక్వెన్షియల్‌గా క్యూ3లో నికర లాభం 19.4 శాతం దూసుకెళ్లడం విశేషం. క్యూ2లో లాభం రూ.2,407 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం సీక్వెన్షియల్‌గా 0.5 శాతం వృద్ధితో రూ.12,965 కోట్ల నుంచి రూ.13,026 కోట్లకు పెరిగింది. కాగా, పలు బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.2,752 కోట్ల నికర లాభాన్ని, రూ.13,055 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
 
 గెడైన్స్ జూమ్...
 వరుసగా రెండో క్వార్టర్‌లో కూడా ఇన్ఫీ గెడైన్స్‌ను పెంచింది. 2013-14 పూర్తి ఏడాదికి డాలర్ రూపంలో ఆదాయ వృద్ధి 11.4-12 శాతంగా ఉండొచ్చని క్యూ3 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విశ్లేషకులు 11-12 శాతం గెడైన్స్‌ను అంచనా వేశారు. కాగా, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో డాలర్ ఆదాయ గెడైన్స్‌ను ఇన్ఫీ 9-10 శాతానికి పెంచడం(అంతక్రితం అంచనా 6-10%) గమనార్హం. ఇక రూపాయి ప్రాతిపదికన కూడా ఇన్ఫీ ఈ ఏడాది  గెడైన్స్‌ను మరోసారి పెంచింది. ఆదాయ వృద్ధి 24.4-24.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది(డాలరుతో రూపాయి మారకం విలువను 61.81గా పరిగణనలోకి తీసుకుంది). క్యూ2లో ఈ గెడైన్స్‌ను 13-17 శాతం స్థాయి నుంచి 21-22 శాతానికి పెంచడం తెలిసిందే.
 
 ఉద్యోగులు తగ్గారు...
 డిసెంబర్ క్వార్టర్‌లో స్థూలంగా 6,682 మంది సిబ్బందిని ఇన్ఫీ, దాని అనుబంధ సంస్థలు నియమించుకున్నాయి. అయితే, 8,505 మంది కంపెనీని వీడారు. అంటే నికరంగా నియామకాలేవీ లేకపోగా... 1,823 మంది కంపెనీని వీడారు. డిసెంబర్ 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖంపట్టి 1,58,404కు చేరింది. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1,60,227గా ఉంది. ఉద్యోగుల వలసల(అట్రిషన్ రేటు) 18.1 శాతానికి పెరగడం(క్యూ2లో 17.3%-గత క్యూ3లో 15.1%) గమనార్హం.
 
 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...

  • అక్టోబర్-డిసెంబర్(క్యూ3) మూడు నెలల కాలంలో అనుబంధ సంస్థలతో కలసి ఇన్ఫోసిస్ మొత్తం 54 కొత్త క్లయింట్లను సంపాదించింది. ఈ ఏడాది క్యూ2లో కొత్త క్లయింట్ల సంఖ్య 68 కాగా, గతేడాది క్యూ3లో 89గా ఉంది.
  • డిసెంబర్ 31 నాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.27,440 కోట్లకు పెరిగాయి. క్యూ2లో ఇది రూ.26,907 కోట్లు.
  • యూబీ ప్రవీణ్ రావును అదనపు, హోల్‌టైమ్ డెరైక్టర్‌గా, కిరణ్ మజుందార్ షాను స్వతంత్ర డెరైక్టర్‌గా నియమిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి.
  • మాజీ సీఎఫ్‌ఓ, డెరైక్టర్ వి. బాలకృష్ణన్ గత నెలలో(డిసెంబర్ 31 నుంచి అమలు) ఇన్ఫీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
  • మెరుగైన ఫలితాలు, గెడైన్స్ పెంపులో ఇన్ఫీ షేరు లాభాల జోరును కొనసాగించింది. శుక్రవారం బీఎస్‌ఈలో రూ.3,575 స్థాయిని తాకింది. చివరకు 2.84% లాభంతో రూ.3,549 వద్ద ముగిసింది.

 
 ఇక మంచిరోజులే...: శిబులాల్
 ఐటీ పరిశ్రమకు ఈ ఏడాది నుంచి ఇక మంచిరోజులు రానున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో మా క్లయింట్లకు ఐటీ సేవలపై పెట్టుబడుల విషయంలో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తోందని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ పేర్కొన్నారు. ‘సంస్థాగతంగా కంపెనీలో ఇటీవల చేపట్టిన కొన్ని మార్పులు మార్కెట్ వాటాను పెంచుకోవడం, క్లయింట్లతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో తోడ్పడనున్నాయి. కొంతమంది ఉన్నతోద్యోగులకు ఇన్ఫోసిస్‌లో కంటే మరింత ఉన్నతమైన అవకాశాలు, ఆశయాలు ఉండొచ్చు. అందుకే వాళ్లు కంపెనీని వీడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
 
 వైదొలగడం వాళ్లకు మంచిదే: మూర్తి
 ఇటీవల మేం చేపట్టిన పలు మార్పులు, చర్యల సానుకూల ఫలితాలు రానున్న కాలంలో కచ్చితంగా కనబడతాయి. ఈ విషయంలో ఇన్ఫీ ఉద్యోగులందరిలోనూ సంపూర్ణ విశ్వాసం ఉందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. ఆయన పునరాగమనం తర్వాతే చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా వైదొలగుతున్నారన్న ప్రశ్నకు... ‘ఇది వాళ్లకూ, కంపెనీకి కూడా మంచిదే’ అని సమాధానమిచ్చారు. కొత్త ప్రెసిడెంట్లుగా నియమించిన బీజీ శ్రీనివాస్, యూబీ ప్రవీణ్ రావులకు తమ కొత్త బాధ్యతల్లో నిలదొక్కుకోవడానికి కొంత సమయమిస్తామని కూడా మూర్తి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement