సీఈసీతో భన్వర్‌లాల్ భేటీ | Bhanwar lal to meet election commissioner | Sakshi
Sakshi News home page

సీఈసీతో భన్వర్‌లాల్ భేటీ

Published Wed, Oct 21 2015 1:31 AM | Last Updated on Tue, Aug 14 2018 5:45 PM

సీఈసీతో భన్వర్‌లాల్ భేటీ - Sakshi

సీఈసీతో భన్వర్‌లాల్ భేటీ

ఓటర్ల సవరణపై నివేదిక అందజేత
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటర్ల సవరణలపై నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీం జైదీతో భన్వర్‌లాల్ సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఓటర్ల సవరణ, తొలగింపు ప్రక్రియలో పాటిస్తున్న నిబంధనలను వివరించారు. జిల్లాలవారీగా తొలగించిన, తొలగించడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన జైదీకి తెలియచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉప ఎన్నికలపైనా చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి చేసిన ఫిర్యాదులపై భన్వర్‌లాల్ నుంచి సీఈసీ వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
 ‘గ్రేటర్’లో తొలగింపులు 6 శాతమే: భన్వర్‌లాల్
 గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల తొలగింపు ఆరు శాతమేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. సీఈసీతో భేటీ అనంతరం భన్వర్‌లాల్ విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లో 26 శాతం తొలగింపులు జరిగాయని, నిజామాబాద్‌తో పోలిస్తే గ్రేటర్‌లో తొలగించింది ఆరు శాతమేనని, ఎక్కువ తొలగింపులు జరగలేదన్నారు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో చాలా తొలగింపులు ఉన్నాయన్నారు. ఓటర్ల తొలగింపులో నిబంధనలు పాటిస్తున్న విషయమై సీఈసీకి నివేదిక అందజేశామన్నారు. సనత్‌నగర్‌లో ఓటర్ల తొలగింపుపై చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓటర్ల తొలగింపునకు సంబంధించి కొంత ధ్రువీకరణ జరిగిందని, ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికపై ఎన్నికల సంఘం ప్రకటిస్తే అందరికీ తెలుస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై చర్యల విషయమై ప్రశ్నించగా.. ‘ఆ అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, కేవలం ఎన్నికలు నిర్వహించడమే మా పని’ అంటూ బదులిచ్చారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ప్రశ్నించగా ‘టీఆర్‌ఎస్‌కు, నాకు సంబంధం ఎలా ఉంటుంది? నేను ఏపీ కేడర్ అధికారిని. అక్కడ టీఆర్‌ఎస్ పార్టీ లేదు కదా. తెలంగాణకు ఇన్‌చార్జి సీఈవోగా ఉన్నా. అధికారిగా సీఎం కేసీఆర్‌ను కలుస్తుంటా’ అని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement