స్పెషల్ ప్యాకేజీ భిక్ష కాదు.. మా హక్కు
న్యూఢిల్లీ: బీహార్ మీద వరాల జల్లు కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. మోదీ ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ తమ రాష్ట్ర హక్కని, భిక్ష కాదని పేర్కొన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు తమకు అక్కర్లేదంటూ పరోక్షంగా విరుచుకుపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నట్టయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిపై బీజేపీ తన దాడిని ఎక్కుపెడుతూ, అటు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది.
స్పెషల్ ప్యాకేజీ తమ హక్కని, సహాయం కాదని తాను నొక్కి వక్కాణిస్తున్నట్లు నితీష్ వ్యాఖ్యానించారు. అంత ఆర్భాటంగా ప్రకటించిన ఆ ప్యాకేజీ వివరాలేంటో చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కోసం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రాధేయపడాలంటే అందుకు తాను సిద్ధమన్నారు. ఆ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కామెంట్ చేశారు.
మంగళవారం బీహార్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మరో రూ.40 వేల కోట్ల గ్రాంట్ ఇస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ బీహార్ రాష్ట్రం బీమారు స్టేట్ గా ముద్రపడింది అంటే నితీష్ కు కోపం వస్తోందన్నారు. దీన్నిఅంగీకరించని, నితీష్ సహాయాన్నిమాత్రం అర్థిస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీహార్ సీఎం మండిపడ్డారు.
బీహార్ లో ఆటవిక పాలనకు చరమాంకం పలకాల్సిన సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ గతంలో కూడా వ్యాఖ్యానించింన సంగతి విదితమే.
While I will wait to hear details of the so called package announced by Modiji, I emphasize, special assistance is OUR RIGHT & not a favor
— Nitish Kumar (@NitishKumar) August 18, 2015