
2019లో మోదీని ఎదుర్కోవాలంటే..?
2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కోవాలంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మహాకూటమి తరహాలో అన్ని పార్టీలు ఏకం కావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: 'వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే నేత ఎవరూ లేరు. 2019 ఎన్నికలను మరిచి 2024లో గెలవడంపై దృష్టిసారించాలి'.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలివి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కోవాలంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మహాకూటమి తరహాలో అన్ని పార్టీలు ఏకం కావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు.
'మోదీ గాలిని తట్టుకుని, బీజేపీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లతో బీఎస్పీ పొత్తుపెట్టుకోవాలి. లేకపోతే బీజేపీని ఓడించడం కష్టం' అని జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించిన సంగతి తెలిసిందే.
బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో తమ పార్టీ బలహీనంగా ఉందని, 2019 ఎన్నికలకు తప్పనిసరిగా మహా కూటమిని ఏర్పటు చేయాలని అన్నారు. యూపీలో మహాకూటమి లేనందువల్లే బీజేపీ గెలిచిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి అభిప్రాయపడ్డారు. మోదీకి పోటీగా మహాకూటమి తరఫున బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా బరిలో దింపాలని జేడీయూ నేతలు చెప్పారు.