త్వరలోనే పార్లమెంటు ముందుకు టి.బిల్లు: షిండే
ముంబై: తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం తన పనిని దాదాపు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. టీ.బిల్లు అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు. ముందుగా టీ.బిల్లు నివేదికను కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. అనంతరం న్యాయశాఖ నుంచి రాగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని షిండే తెలిపారు.
జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.