కంచికి చేరిన ఖరీదైన బ్రేకప్!
జెనీవా: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసు ఎట్టకేలకు ఒక అంగీకారానికి వచ్చింది. దాదాపు 4.2 బిలియన్ డాలర్లు (రూ. 27,358 కోట్ల) భరణం చెల్లించాలంటూ ఈ కేసులో కోర్టు 2014లో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ప్రమేయం లేకుండా వీడిపోయేందుకు సదరు భార్యభర్తలు అంగీకరించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా పేరొందిన ఈ కథేమిటంటే!
రష్యన్ కుబేరుడు దిమిత్రి రిబోలోవ్లెవ్, ఆయన భార్య ఎలెనా 23 ఏండ్లు కలిసి కాపురం చేసి.. 2008లో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. అప్పటినుంచి భరణం ఎంత చెల్లించాలనే విషయమై ఇద్దరి మధ్య వివాదం న్యాయస్థానాల్లో నలుగుతున్నది. ఫ్రెంచ్ ఫుట్బాల్ క్లబ్ యాజమాని, బిలియనీర్ అయిన రిబోలోవ్లెవ్ సంపదను లెక్కగట్టే విషయంలో ప్రధానంగా చిక్కుముడి తలెత్తింది. రిబోలోవ్లెవ్ 2005లో తన కంపెనీ వాటాలన్నింటినీ ఓ ట్రస్టుకు బదలాయించారు. ఆ తర్వాత మూడేళ్లకు వాటిని అమ్మారు. అయితే రిబోలోవ్లెవ్ సంపదను 2005 వాటాల ప్రకారం లెక్కించారని, 2008లో పెరిగిన వాటాల విలువ ప్రకారం ఆయన సంపదను గణించాలని ఎలెనా తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్కు చెందిన కోర్టు ఎలెనాకు నాలుగు బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (4.2 బిలియన్ డాలర్ల) భరణం చెల్లించాలని 2014 మేలో ఆదేశాలు ఇచ్చింది. రిబోలోవ్లెవ్ సంపదలో ఇది సగానికి సమానం. ప్రపంచంలోనే ఆల్టైమ్ ఖరీదైన విడాకులు కేసుగా ఇది అప్పట్లో పేరొందింది. దీంతో ఆయన గత ఏడాది జూన్లో అప్సీల్స్ కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు ఆదేశాలను ఈ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలపైనా ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ మాజీ భార్యాభర్తలు విడాకుల నిబంధనల విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్టు మంగళవారం ప్రకటించారు. విడాకుల ఒప్పందానికి సంబంధించిన నియమనిబంధనలపై ఒక అంగీకారానికి వచ్చామని, దీంతో ఈ విషయమై న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నమని వారు ప్రకటించారు. అయితే విడాకుల భరణంగా ఎంతమొత్తం చెల్లించనున్నది ప్రకటించలేదు. తమ విడాకుల వ్యవహారంలో ఇక కోర్టు ప్రమేయం ఉండబోదని వారు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
అత్యంత సంపన్నుడైన రిబోలోవ్లెవ్కు పెయింటింగ్ కళాకండాలను సేకరించే అలవాటు ఉంది. అయితే పికాసో, డెగాస్, పాల్ గౌగ్విన్ వంటి కళాకారుల పెయింటింగ్లను తనకు అధిక ధరకు విక్రయించినట్టు స్విస్ ఆర్ట్ డీలర్ య్వెస్ బౌవియర్పై విమర్శలు చేసి.. ఇటీవల ఆయన మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు.