టికెట్ల పంపిణీలోనూ వారసత్వమే! | BJP announces second list for Madhya Pradesh elections | Sakshi
Sakshi News home page

టికెట్ల పంపిణీలోనూ వారసత్వమే!

Published Thu, Nov 7 2013 3:27 AM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

BJP announces second list for Madhya Pradesh elections

భోపాల్: దేశంలో ఏళ్ల తరబడి కుటుంబ పాలన సాగిస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాలో ముందుకు సాగుతోంది. ఆ పార్టీ మంగళవారం 82 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ప్రముఖుల వారసులకే ఎక్కువగా టికెట్లు దక్కడం ఈ విషయాన్ని మరోసారి రుజువుచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అవిభాజ్య మధ్యప్రదేశ్‌కు పదేళ్లపాటు (2003 వరకూ) ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్ కుమారుడికి ఈ జాబితాలో టికెట్ ఖరారైంది. దిగ్విజయ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన రాఘోగఢ్ నియోజకవర్గ టికెట్‌ను ఆయన కుమారుడు జైవర్ధన్‌సింగ్‌కు కాంగ్రెస్ కేటాయించింది.
 
 అలాగే దివంగత కాంగ్రెస్ నేత అర్జున్‌సింగ్‌కు అల్లుడైన భువనేశ్వర్‌సింగ్‌కు సింగ్రౌలీ నియోజకవర్గ టికెట్ దక్కింది. రెండో జాబితాలో టికెట్లు పొందిన ప్రముఖుల వారసుల్లో దివంగత పీసీసీ చీఫ్ సుభాష్ యాదవ్ కుమారుడైన సచిన్ యాదవ్ (కాసర్వాడ్ స్థానం), మాజీ మంత్రి ఇందర్‌జిత్ పటేల్ కుమారుడు కమలేశ్వరి పటేల్, ఏఐసీసీ కార్యదర్శి సజ్జన్‌సింగ్ వర్మ భార్య రేఖా వర్మ (దేవాస్ నియోజకవర్గం), మాజీ ఎంపీ, సింధియా వంశీయుల అనుచరుడు మహేంద్రసింగ్ కాలుఖేదా (ముంగౌలీ స్థానం) ఉన్నారు. ఈ నెల 1న ప్రకటించిన తొలి జాబితాలో అర్జున్‌సింగ్ కుమారుడు, సీఎల్పీ నేత అజయ్‌సింగ్, డిప్యూటీ సీఎల్పీ నేత బిసాహులాల్‌సింగ్, పార్టీ మధ్యప్రదేశ్‌శాఖ మాజీ ఉపాధ్యక్షుడు సత్యదేవ్ కటారే, సమాజ్‌వాదీ పార్టీ మధ్యప్రదేశ్‌శాఖ మాజీ అధ్యక్షుడు నారాయణ్ త్రిపాఠీ, పీసీసీ మాజీ చీఫ్ రాధాకృష్ణ మాలవ్యా కుమారుడు రామ్‌లాల్ మాలవ్యా తదితరులకు టికెట్లు దక్కాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement