రాజ్‌గర్హ్, మధ్య ప్రదేశ్ : మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారణాయుధాల వినియోగ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్‌కు మరో అవకాశం దొరికినట్లు అయింది. హిందూవుల రక్షణ పేరుతో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ ఈ నెల 3 నుంచి జూన్ 1 వరకూ రాజ్‌గర్హ్‌లోని బవారాలో స్థానిక యువతకు తుపాకీ వంటి ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియోలను భజరంగ్ దళ్ జిల్లా కన్వినర్ దేవి సింగ్ సోందియా సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాక ‘1984 నుంచి మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దేశ విద్రోహక శక్తులు, లవ్ జిహాద్ వంటి వాటి నుంచి హిందూవులకు రక్షణ కల్పించడానికి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు’ తెలిపారు.
ఈ వీడియోలు, ఫోటోలు బీజేపీ పై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధాలుగా మారాయి. ఈ విషయం గురించి ‘మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమానికి అనుమతిచ్చిందా..?. డీజీపీ కానీ, రాజ్‌గర్హ్ ఎస్పీ కానీ ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారా..? అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అలానే దిగ్విజయ్ సింగ్ కుమారుడు, రాఘోగర్హ్ ఎమ్మెల్యే జైవర్ధన్ ‘జాతీయవాదం పేరుతో భజరంగ్ దళ్ యువతకు మారణాయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫొటోలు చూసి నేను షాకయ్యాను’ అని ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజ్నిష్ అగ్రావాల్ స్పందిస్తూ... ఎవరైనా స్వీయ రక్షణ శిక్షణా తరగతులు నిర్వహించుకోవచ్చు. కానీ దానికి ఎవరు అనుమతిచ్చారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment