బిహార్‌ సంక్షోభం: అటు నుంచి నరుక్కొచ్చిన బీజేపీ | bjp bang in bihar: nitish resigns | Sakshi
Sakshi News home page

బిహార్‌ సంక్షోభం: అటు నుంచి నరుక్కొచ్చిన బీజేపీ

Published Wed, Jul 26 2017 8:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బిహార్‌ సంక్షోభం: అటు నుంచి నరుక్కొచ్చిన బీజేపీ - Sakshi

బిహార్‌ సంక్షోభం: అటు నుంచి నరుక్కొచ్చిన బీజేపీ

న్యూఢిల్లీ/పట్నా: ఒకే ఒరలో దూరిన రెండు కత్తుల్లా.. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఇద్దరు మిత్రులు నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు.. ఏడాదిన్నర తిరిగేసరికి అంతే సంచలనాత్మకంగా విడిపోయారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా చేయడంతో రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ)- జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ)- కాంగ్రెస్‌ పార్టీల మహాకూటమి(మహాఘట్బంధన్‌) ప్రభుత్వం బుధవారం కుప్పకూలిపోయింది. తద్వారా బిహార్‌ రాష్ట్రంలో మరోసారి తాత్కాలిక రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి బలవంతంగా వెళ్లిపొమ్మని చెప్పనూలేక, కలిసి పనిచేయలేనూలేక నితీశ్ కుమార్‌ తనంతటతానే రాజీనామా చేశారు. ‘రాజకీయాల్లో ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయ’నే విషయం తెలిసి కూడా నితీశ్‌ సీఎం పీఠాన్ని ఎలా త్యజించగలిగారు? అంతపెద్ద సాహసానికి ఎలా సిద్ధపడ్డారు??

సమాధానం అందరికీ తెలిందే!
షెడ్యూల్‌ ప్రకారమే జరిగినప్పటికీ, పట్నాలో సీఎంగా నితీశ్‌ రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. బహుశా సమావేశం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే మోదీ నితీశ్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. కళంకితులను వదిలించుకున్నందుకు కితాబిచ్చారు. ఇక, బిహార్‌ వ్యవహారల పర్యవేక్షణకుగానూ బీజేపీ అధిష్టానం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.

గడిచిన కొద్ది నెలలుగా.. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ భారీ వ్యూహంతో ముందుకు వెళుతోంది. దాని వ్యూహాల్లో అతి ప్రధానమైనవి.. వ్యతిరేక శక్తులను చిత్తు చేయడం, కలసివచ్చేవాళ్లకు గట్టి నమ్మకాన్ని కల్పించడం.  243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీకి 80 సీట్లున్నాయి. తర్వాతి స్థానంలో జేడీయూ(71), బీజేపీ(53), కాంగ్రెస్‌ (27) ఎల్‌జేపీ(2), ఆర్‌ఎల్‌ఎస్పీ(2), హెచ్‌ఎఎం(1), సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌కు‌(3), ఇండిపెండెంట్లకు 4 సీట్ల బలం ఉంది. మహాకూటమి ప్రభుత్వం నడుస్తుండగానే.. ‘నితీశ్‌ బజేపీ మద్దతు తీసుకుని.. లాలూను పక్కన పెట్టాలి’ అని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్‌ కుమార్‌ మోదీ బాహాటంగా ప్రకటన చేశారు. ఒకటికాదు.. రెండు కాదు.. (యూపీ ఎన్నికల తర్వాత) సుశీల్‌ మోదీ ఈ మాటను ఏ వందసార్లో అని ఉంటారు.

నితీశ్‌ను ఎలా నమ్మించారు?
మద్దతు ఇస్తామని చెప్పినంత మాత్రాన నిజంగా ఇస్తారా? ప్రభుత్వం కూలిపోతే, ఎన్నికలు అనివార్యమైతే బీజేపీ తన లాభం తాను చూసుకోవాలనుకుంటుందికానీ తిరిగి నితీశ్‌ను పీఠంపై కూర్చోబెడుతుందా? సరిగ్గా ఇక్కడే బీజేపీ గెలిచింది. ‘విశ్వసనీయత’ అనే పాచికతో నితీశ్‌ను మంచిచేసుకుంది. మహాకూటమికి ముందు నితీశ్‌(జేడీయూ) 17 ఏళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామి. కాబట్టి ఆయనకు బీజేపీ ఎలా పనిచేస్తుందో, అది కాంగ్రెస్‌ కంటే ఏ మేరకు భిన్నమైనదో, మాట ఇస్తే కట్టుబడి ఉంటుందో లేక నీరుగారుస్తుందో అనే విషయాలపై స్పష్టత ఉంది. ప్రస్తుత పరిపాలన తీరు ఎలా ఉన్నా, పార్టీ పరంగా ‘మాటంటే మాటే’ అనే సిద్ధాంతాన్ని బీజేపీ మొదటినుంచీ కొనసాగిస్తోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో సైతం స్థానిక పార్టీలతో బీజేపీ సాగించే స్నేహం.. కాంగ్రెస్‌ పార్టీ స్నేహం కంటే చాలా భిన్నమైనది.

షా వ్యూహం.. చిన్న మోదీ ఆచరణ.. పెద్ద మోదీ పర్యవేక్షణ
నితీశ్‌ను దగ్గరకు తీసుకోవాలంటే, ముందుగా లాలూను దూరం చేయాలనేది బీజేపీ పెద్దల వ్యూహం. ఆ మేరకు అమిత్‌ షా వ్యూహం పన్నడం,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్‌ మోదీ(చిన్నమోదీ) దానిని అమలు పర్చడం, మొత్తం వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(పెద్ద మోదీ) పర్యవేక్షించినట్లు సమాచారం.

ముందుగా సుశీల్‌ మోదీ ‘అటు నుంచి నరుక్కురావడం..’ ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత నితీశ్‌కు ఓపెన్‌ ఆఫర్‌(బీజేపీ మద్దతు) ప్రకటించారు. తేడా వచ్చి లాలూ దూరమైతే నితీశ్‌కు బీజేపీ అండ ఉంటుందనే నమ్మకాన్ని జేడీయూ శ్రేణులకు, ప్రజలకు కల్పించారు. ఆ తర్వాత లాలూ కుటుంబంపై వరుస దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు లాలూ కుటుంబం అక్రమ ఆస్తులను తిరగతోడాయి. ఆరోపణల నేపథ్యంలో లాలూ కుమారులు తేజస్వీ, తేజ్‌ప్రతాప్‌లు రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి. కానీ నితీశ్‌ వాళ్ల రాజీనామాను కోరలేదు. కళంకితులతో కలిసి పనిచేయలేనని చెప్పి తెలివిగా లాలూ కౌగిలి నుంచి జారుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement