
ముందస్తు పథకంలో భాగమే..!
లోక్‌సభ ప్రసారాల నిలిపివేతపై బీజేపీ
తీర్మానం ఆమోదించిన పార్లమెంటరీ పార్టీ
ఎవరి ఒత్తిడితో నిలిపివేశారో చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీ: లోక్‌సభలో కీలకమైన తెలంగాణ అంశాన్ని చర్చకు చేపట్టిన సమయంలో లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోవడాన్ని బీజేపీ ఖండించింది. ఈ మేరకు బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభ సచివాలయం పేర్కొన్నట్టుగా సాంకేతిక సమస్య వల్ల అది చోటు చేసుకోలేదని, ముందస్తు పథకంలో భాగమేనని బీజేపీ పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనని, తెలంగాణ అంశంపై చర్చను దేశం వీక్షించకుండా చేసేందుకు ప్రజాస్వామ్య సంప్రదాయూలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు సభా కార్యక్రమాలన్నిటినీ ప్రత్యక్ష ప్రసారం చేయూలని ఎల్.కె.అద్వానీ అధ్యక్షతన జరిగిన బీజేపీపీ సమావేశం డిమాండ్ చేసింది. ఈ ఘటనతో లోక్‌సభ సచివాలయం విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని రాజ్యసభలో బీజేపీ ఉప నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఎవరి ఒత్తిడితో ఈ విధంగా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేశారో అది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అసలు ఆ సమయంలో కార్యక్రమం రికార్డింగ్ కూడా చేయలేదని తెలుస్తోంది. ఆడియో లేదా వీడియో రికార్డింగ్ కూడా ఎందుకు జరగలేదు?’ అని పార్లమెంటు ఆవరణలో జరిగిన భేటీ అనంతరం ఆయన ప్రశ్నించారు. రాజకీయ సమస్య కారణంగానే లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారానికి అంతరాయం కలిగిందని మురళీ మనోహర్ జోషీ చెప్పారు. ‘సభా కార్యక్రమాలను ప్రజలు వీక్షించేందుకే ఈ వ్యవస్థను నెలకొల్పారు. దాన్ని మీరు నిలిపివేసి సాంకేతిక సమస్య అంటూ ఓ పసలేని కారణం చెబుతారా?’ అంటూ ఆయన యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇలావుండగా ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడంతో.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సభ్యులందరూ అలుపెరుగకుండా పనిచేయూలని అంతకుముందు అద్వానీ కోరారు.
సిగ్నల్స్ వైఫల్యం వల్లే...
లోక్‌సభలో నెలకొల్పిన తొమ్మిది ఆటోమాటిక్ కెమెరాల నుంచి సిగ్నల్స్ అందడంలో చోటుచేసుకున్న వైఫల్యంతోనే లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోరుునట్టు దీనిపై నిర్వహించిన దర్యాప్తు తేల్చింది. ఎన్నడూలేని విధంగా సుమారు 90 నిమిషాల పాటు ప్రసారాలు నిలిచిపోవడంపై స్పీకర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు భవనంలోని రూమ్ నంబర్ 50లో ఉన్న మిక్సర్ రూమ్‌కు కెమెరాల నుంచి సిగ్నల్స్ అందకపోవడంతోనే సమస్య చోటు చేసుకుందని లోక్‌సభ టీవీ సీఈఓ రాజీవ్ మిశ్రా బుధవారం పీటీఐకి చెప్పారు. సభా కార్యక్రమాల ఆడియో వస్తున్నప్పటికీ వీడియో మాత్రం లేదని వివరించారు.
కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు: సీపీఎం
న్యూఢిల్లీ: వివాదాస్పద తెలంగాణ బిల్లును లోక్‌సభలో అన్ని నిబంధనలూ ఉల్లంఘించి ఆమోదించారని సీపీఎం ఆరోపించింది. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని దుయ్యబట్టింది. ఈ బిల్లుపై యూపీఏ వైఖరి ప్రజాస్వామ్యానికి, సమాఖ్య సూత్రాలకు పెనుముప్పు అని సీపీఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. ‘దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన బిల్లుపై చర్చ కూడా జరపలేదు. సభలో గందరగోళం మధ్యే మూజువాణి ఓటుతో ఆమోదించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కవడం వల్లే బిల్లు పాసైంది’ అని అంది.