సమాజవాది పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల భారతీయ జనతపార్టీ బుధవారం లక్నోలో మండిపడింది.ముజఫర్నగర్ అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించిన నేపథ్యంలో అఖిలేష్కు ఎలా క్లీన్ చీట్ ఇస్తారని యూపీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదుర్ పాథక్ ప్రశ్నించారు.
ముజఫర్నగర్ అల్లర్లు మత ఘర్షణలుగా ములాయం వ్యాఖ్యానించడం పట్ల విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో నెలకొన్న సంఘటనలు అఖిలేష్ ప్రభుత్వ హయాంలో పునారావృతం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకరమైన సంఘటనగా ముజఫర్నగర్ అల్లర్లు అని ఆయన అభివర్ణించారు.
అయితే ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం యూపీలోని అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా యూపీ గవర్నర్ను కలసి అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రాన్ని ఆ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఆందజేసింది. సెప్టెంబర్ 16 నుంచి యూపీ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో ముజఫర్నగర్ అంశాన్ని సభలో లేవనెత్తుతామని బీజేపీ ప్రకటించింది. ముజఫర్నగర్లో శనివారం చోటు చేసుకున్న అల్లర్ల వల్ల దాదాపు 40 మంది మరణించగా, మరో 1000 మంది వరకు గాయపడ్డారు. ముజఫర్నగర్లో జరిగిన అల్లర్లపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ మంగళవారం ఆగ్రాలో తన కుమారుడు అఖిలేష్కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బీజేపీ బుధవారంపై విధంగా స్పందించింది. అయితే ముజఫర్నగర్లో ఏ రాజకీయనాయకుడు పర్యటించకుండా ఉండేలా అఖిలేష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.