సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తులు, సర్దుబాట్లపై బీజేపీలో కలకలం మొదలైంది. కోర్ కమిటీ సమావేశానికి చివరి క్షణంలో హాజరైన పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడుపై పార్టీ రాష్ట్ర నేతలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ ఎన్నికల వ్యూహం, సీమాంధ్ర ఉద్యమం, సంస్థాగత వ్యవహారాలు, కీలక నియోజకవర్గాల గుర్తింపు తదితర అంశాలను చర్చించేందుకు కోర్ కమిటీ బుధవారమిక్కడి గుజరాత్ భవన్‌లో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సతీష్ జీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఎక్కా శేఖర్, శ్యాంజీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, వెంకయ్య నాయుడు, కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
టీడీపీతో గతంలో పొత్తు, గెలిచిన సీట్లు, ప్రస్తుత పరిస్థితి గురించి భేటీలో చర్చ సందర్భంగా.. వెంకయ్యపై పార్టీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ‘‘ఎవరెవరో ఏమోమో మాట్లాడుతున్నారు. లేనిపోనివన్నీ అంటున్నారు. తెలంగాణలో అనేక మంది ఇతర పార్టీల వారు వచ్చి చేరతారని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ చేరినట్టు కనిపించడం లేదు’’ అని వెంకయ్య నాయుడు అనడంతో యెండల తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు మీరేం మాట్లాడుతున్నారు? పొత్తులుండవని సుష్మాస్వరాజ్ పాలమూరులో చెప్పిన మర్నాడే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సంకేతం ఇచ్చేలా మీరు బెంగళూరులో మీడియాతో చెప్పారు. మీరు చేసే పని వల్లే లేనిపోని అపోహలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో ఏమున్నదని చంద్రబాబుతో పొత్తంటున్నారు? టీడీపీతో పొత్తనే ఉహాగానాలు రావడంతోనే వచ్చే వాళ్లందరూ వెనక్కుపోయారు. చివరకు పంచాయతీ సర్పంచులు కూడా పార్టీలో చేరడానికి వెనకాముందాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డట్టు తెలిసింది. ఇదే సమయంలో వీర్రాజు జోక్యం చేసుకుంటూ.. సీమాంధ్రలో మాత్రం పొత్తు కావాలని ఎవరు కోరారని వెంకయ్యను నిలదీశారు. ‘‘చంద్రబాబుతో పొత్తని ఎవరు డిసైడ్ (నిర్ణయం) చేశారు. ఇందులో మా పాత్ర ఏమీ ఉండదా? దీనిపై పెద్ద నేతలెవ్వరూ స్పష్టత ఇవ్వరా?’’ అని ప్రశ్నించారు. తర్వాత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పొత్తులుండవని రాజ్‌నాథ్ సింగ్ కూడా తనకు చెప్పారని, అవసరమైతే ఢిల్లీలో ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి తనతో పాటు కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ దశలో వెంకయ్యనాయుడు సమావేశం నుంచి నిష్ర్కమించినట్టు తెలిసింది. అనంతరం పార్టీ నేతలు, కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రాంత పదాధికారులతో భేటీ అయ్యారు. సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రాప్రాంత నేతలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు.
టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు
బీజేపీ తెలంగాణ పదాధికారుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ ప్రాంత పదాధికారులు తేల్చిచెప్పారు. తెలంగాణలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీ ఈ వదంతులను సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమం, తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదిక, సంస్థాగత నిర్మాణం, తెలంగాణ బిల్లు తదితర అంశాలను చర్చించేందుకు పార్టీ ఉద్యమ కమిటీ నేతలు, తెలంగాణ ప్రాంత పథాధికారులు బుధవారమిక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యమ కమిటీ ఛైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సతీష్‌జీ, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు రామచంద్రరాజు తదితరులు హాజరయ్యారు. అనంతరం పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ స్థాయిలో టీడీపీతో పొత్తు కుదిరిందన్న ప్రచారంలో వాస్తవం లేదని యెండల స్పష్టంచేశారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్తామన్నారు.
వెంకయ్యా.. ఇదేం బాగా లేదయ్యా!
Published Thu, Oct 17 2013 3:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement