ముఖ్యమంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!
మీరట్: వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీని గెలిపిస్తే పేదలకు స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటనను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలా హామీని ఇవ్వడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనంటూ ఎన్నికల సంఘానికి గురువారం ఫిర్యాదు చేసింది.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉచిత వరాలను సీఎం అఖిలేశ్ గుప్పిస్తున్నారని, ఓటర్లకు గాలం వేసే ఉద్దేశంతో ఆయన ఇస్తున్న ఈ హామీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఈసీకి లేఖ రాశారు. 'స్మార్ట్‌ఫోన్ కోసం పేర్లు నమోదుచేసుకోవాలని స్వయంగా సీఎం అఖిలేశ్ ప్రజలకు చెప్తున్నారు. ఎన్నికల్లో ఎస్పీకి ఓట్లు రాబట్టేందుకే ఆ పథకాన్ని ప్రకటించారు' అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఎస్పీ విజయం సాధించి.. 2017 ఉత్తరార్థంలో ప్రజలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినా.. అది ఎన్నికలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కోసం వచ్చేనెల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని, కాబట్టి ఎన్నికల సంఘం ఈ అంశంపై సత్వరమే దృష్టి పెట్టి.. దీనిని ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.