ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు?
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గుజరాత్ లో ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉందా?. సోమవారం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుండటంతో త్వరలోనే గుజరాత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నత శ్రేణుల్లో ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ కనీసం ఆరు నెలలు ముందే ఈ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు. బీజేపీలోని ఓ వర్గం గుజరాత్ రాష్ట్రంలోని బీజేపీలో వ్యవస్ధాగతంగా పలు మార్పులు ఆశిస్తున్నారని, ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండాలని కోరుకుంటున్నారని సదరు నేత పేర్కొన్నారు.
2017 ఎన్నికల్లో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అంతగా ప్రభావం చూపలేరనే భావన పార్టీ వర్గాల్లో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. రూపాని స్ధానంలో ఓబీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం వల్ల ఆప్, కాంగ్రెస్ లకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గుజరాత్ జనాభాలో 45 శాతం మంది ఓబీసీకి చెందిన వారే. ఇందుకు సంబంధించిన ప్రకటన జనవరి ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని బీజేపీ నేత వెల్లడించారు.