మరో రాష్ట్రంలో బీజేపీ పాగా!
ఒడిషాలో ఇన్నాళ్లూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేడీ పాలనకు బీజేపీ ముగింపు పలకబోతోందా? ఇప్పటివరకు ఎన్నడూ లేనిది.. తొలిసారిగా అక్కడ నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది.
ఒడిషాలో ఇన్నాళ్లూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేడీ పాలనకు బీజేపీ ముగింపు పలకబోతోందా? ఇప్పటివరకు ఎన్నడూ లేనిది.. తొలిసారిగా అక్కడ నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఇంతకుముందు 2012లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు 850 శాతం అధిక ఫలితాలను ఆ పార్టీ సాధించగలిగింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. మరోవైపు కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనితీరుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందనడానికి ఈ ఫలితాలే సాక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో ఇప్పుడు ఒక ఆశ మొదలైందని ఆయన చెప్పారు.
ఒడిషాలో మొత్తం 853 పంచాయతీ వార్డు స్థానాలున్నాయి. వాటిలో.. 2012లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం 36 వార్డులు మాత్రమే రాగా, ఈసారి ఏకంగా 306 స్థానాలు గెలుచుకుంది. అంటే, 270 స్థానాలు అధికంగా వచ్చినట్లు లెక్క. మరోవైపు బీజేడీ గతంలో 651 వార్డుల్లో గెలవగా ఈసారి 460కి పరిమితమైంది. అంటే, 191 స్థానాలో పోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 126 వార్డులు గెలుచుకోగా, ఈసారి 66 స్థానాలే వచ్చాయి. ఇక జిల్లా పరిషత్తులలో కూడా బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయి. మొత్తం 30 జడ్పీలకు గాను బీజేపీ ఎనిమిది చోట్ల గెలిచింది. 2012లో అసలు జడ్పీలలో బీజేపీ బోణీయే చేయలేదు. గతంలో 28 జడ్పీలను కైవసం చేసుకున్న బీజేడీ.. ఈసారి కేవలం 16కే పరిమితమైంది.