
21, 22 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి భద్రాచలంలో ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళికను సమావేశంలో రూపొందిస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలిపారు.
బీజేపీ సిద్ధాంత కర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జన్మ శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేస్తున్న పోరాటాలకు సంబంధించి నివేదికను జాతీయ కార్యవర్గ సమావేశంలో సమర్పించామన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి వెదిరే శ్రీరాం, సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు