బ్లాక్ బస్టర్... వినాయకుడు..!
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ గా కోట్ల రూపాయల బిజినెస్ చేసిన తెలుగు సినిమా అంటే చిన్నపిల్లలు కూడ చెప్పేస్తారు బాహుబలి అని. అయితే అటువంటి ప్రత్యేకతలు ఉన్న సినిమాలు ఎప్పుడు మార్కెట్లో వచ్చినా ప్రేక్షకులు నీరాజనాలు పట్టడమే కాక... అభిమానులు ఆ గుర్తులను చాలాకాలం చెరిగిపోనివ్వరు. ఆ సమయంలో వచ్చే పండుగలు, ఉత్సవాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్ లు ఒకటేమిటి కొన్నాళ్ళపాటు ప్రతి విషయంలోనూ ఆ సినిమా ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత వైభవంగా జరిపే వినాయక చవితి సందర్భంలోనూ బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది.
దేశంలోనే గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో ముంబై ముందుంటుంది. అందులోనూ కొత్త పద్ధతులు పరిచయం చేయడంలోనూ ఆ నగరం ఎప్పుడూ ఫస్టే. ప్రతిఏటా నవరాత్రుల్లో వీధి మండపాల్లో వినూత్న రీతుల్లో కనిపించే గణేశుడిపై ఈసారి బాహుబలి ఎఫెక్ట్ బాగానే పడింది. భారీ కటౌట్ తో శివలింగాన్ని అలవోకగా భుజాన పెట్టుకొని ఆ ఆజానుబాహుడు (ప్రభాస్) వేసిన అడుగులు సినిమాలో సూపర్ డూపర్ హిట్. అందుకేనేమో ఆ ఎఫెక్ట్ ఈసారి వినాయక విగ్రహాలపై కనిపించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రుల్లో బాహుబలి స్టైల్ విగ్రహాలు భారీగానే కనిపించనున్నాయి. వినూత్న రీతిలో తయారైన ఈ తరహా విగ్రహాలకు మార్కెట్లో మంచి ఆదరణకూడ కనిపిస్తోంది.
ప్రతియేటా వినాయక ప్రతిమలను తయారు చేసే కళాకారులు వివిధ రూపాలను, వ్యక్తిత్వాలను, ఆయా సందర్భాల్లో జరిగిన అభివృద్ధి సంఘటనలను తమ దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి ఒక్క ముంబైలోనే కాక, దేశంలోని పలు నగరాల్లో కళాకారుల చేతిలో భుజాన శివలింగాన్ని పెట్టుకున్న వినాయకుడు (ప్రభాస్ లా) రూపొందడం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా వినాయకుడంటే మనకు గుర్తుకు వచ్చే ఆకారం భారీ ఉదరం. అయితే ఈ సీజన్ లో మాత్రం అభిమానులను తన బాడీతో ఫ్లాట్ చేసిన ప్రభాస్ లా.. గణపతి దేవుడు సిక్స్ ప్యాక్ బాడీతో ఉండటం విశేషం. ఈ ఎఫెక్ట్ పై ఫాన్స్ కూడ... ''ఆ కటౌట్ అలాంటిది మరి'' అంటున్నారు.