వినుమా వినాయక సినిమా కోరిక | Movies special story to vinayaka chavithi | Sakshi
Sakshi News home page

వినుమా వినాయక సినిమా కోరిక

Published Tue, Sep 11 2018 12:02 AM | Last Updated on Tue, Sep 11 2018 12:40 AM

Movies special story to vinayaka chavithi - Sakshi

‘దేవసేన కావాలా? మాషిష్మతి కావాలా?’ అని బాహుబలిని ఎదురు కోరిక కోరిన శివగామి.

కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా కోరికలు కోరికలే.కొన్ని సినిమా కోరికలు చిత్రంగా ఉంటాయి.చూసేవాళ్లలో చోద్యం కలిగిస్తాయి. విజయానికి ‘కీ’గా మారిన సినీ కోరికలు ఇవి.

చదువులు కావాలంటే ఇస్తావు.  స్కూటర్‌ కొనిపెట్టమంటే పెడతావు. ఫలానా పొరుగమ్మ మెడలో ఉన్నట్టున్న మామిడి పిందెల గొలుసు కావాలంటే పోనీలే పాపం అని ప్రసాదిస్తావు. కొడుకును అమెరికా పంపించమంటే ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే వీసా శాంక్షన్‌ చేసి శాన్‌ప్రాన్సిస్కో ఫ్లయిట్‌ ఎక్కిస్తావు. చిన్న చాక్లెట్‌ కావాలన్నా పెద్ద మినిస్టర్‌ పోస్ట్‌ కొట్టాలన్నా ఆ కోరికలన్నీ తీర్చల్సిన దేవుడివి తీర్చే దేవుడివి నీవే.వినాయకునివే. సిద్ధి వినాయకునివే.ప్రతి మనిషిలో కోరికలు కామన్‌. సినిమాల్లో కోరికలు కోరుకునే క్యారెక్టర్లూ కామన్‌. కాని అన్ని సినిమాలు ఒక్కలా ఉండవన్నట్టే అన్ని కోరికలూ వొక్కలా ఉండవు. ఈ సినీ వింత కోరికలు నీకు గుర్తున్నాయా స్వామీ. ఈ కోరికలే కాసులు కురిపించాయి కదా స్వామీ.

అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే ‘చేసుకో అనో.. చేసుకోవద్దు’ అనో తండ్రి అంటాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కూడా తండ్రి ప్రకాష్‌రాజ్‌ తన కొడుకు సిద్ధార్థ ప్రేమ సంగతి విని ఆ మాటే అంటాడు.దానికి సదరు పుత్రరత్నం తిరగబడాలి. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరిన ఆర్యసమాజ్‌లో ఆర్భాటం లేకుండా మూడుముళ్లు వేసి ఆటో ఎక్కి అద్దె పోర్షన్‌కు చేరుకోవాలి.కాని కొడుకు ఒక వింత కోరిక కోరుతాడు.‘ఆ అమ్మాయిని తెచ్చి వారం రోజులు ఇంట్లో పెడతాను. నీకు నచ్చేలా చేస్తాను. ఛాన్స్‌ ఇవ్వు నాన్నా’ అంటాడు.ఇలాంటి కోరిక ఇంతకు ముందు నిజ జీవితంలో ఎవరూ కోరలేదు.సినిమాలోనూ కోరలేదు.అందుకనే ఈ కోరిక పండింది. బాక్సాఫీస్‌ బొజ్జ కలెక్షన్లతో నిండింది.

అదేం చిత్రమో ప్రేమ అనేసరికి వింత వింత కోరికలే వస్తాయి. ‘మరో చరిత్ర’లో అరవ బాలు కమలహాసన్, తెలుగు స్వప్న సరిత ప్రేమించుకోలేదూ? వాళ్లు మరో మాట లేనట్టుగా పెళ్లి చేసుకుంటాము మొర్రో అంటే పెద్దలు కోరిన వింత కోరిక ఇంతకు మునుపు విన్నామా కన్నామా? ‘మీరిద్దరు సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. లవ్‌ లెటర్స్‌ రాసుకోకూడదు. ఇలా చేసిన తదుపరి కూడా మీలో ప్రేమ ఉన్నచో అప్పుడు పెళ్లి’ అంటారు. ఈ కోరిక విని అంత పెద్ద దేవుడుని నీవు కూడా కలవర పడి ఉంటావు కదూ.

ఏవో పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఫలితంగా సిరిసంపదలు కోరుకుంటే వాటిని నువ్వు నెరవేరుస్తే అర్థముంది. స్ట్రయిట్‌ కోరికలకు స్ట్రయిట్‌ రిజల్ట్సు. కాని ‘లేడిస్‌ టైలర్‌’లో  బట్టలు కొట్టే సుందరం కోరుకునే కోరిక ఏమిటి? ‘తొడ మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని’ కదూ. అదేం కోరిక. అట్లాంటి అమ్మాయిని ఎలాగని వెతికేదిక. సెర్చ్‌ వారెంట్‌ తీసుకొని బయలుదేరితే అరెస్టు వారెంటు వస్తుందే. చివరకి అతడికి అలాంటి అమ్మాయిని ఇవ్వకనే నువ్వు బుద్ధొచ్చేలా చేస్తావు. దారిలో పెడతావు. అంతేనా? మరుజన్మలో అతడే ‘ఆ ఒక్కటి అడక్కు’లో హస్తరేఖను నమ్ముకొని సంవత్సరం తర్వాత నేనే కింగ్‌ని అని విర్రవీగితే అలాంటి వెర్రి కోరికతో కలలు గంటూ కూర్చుంటే నష్టమేనని శ్రమ కంటే మించిన వరం లేదని తెలిసొచ్చేలా చేసి ట్రాక్‌ ఎక్కిస్తావు. సరే. ‘ఏప్రిల్‌ ఒకటి విడుదల’లో ఇతని గర్ల్‌ఫ్రెండ్‌ కోరిన కోరిక చాలా తమాషా. నోరు తెరిస్తే అడ్డమైన అబద్ధాలు కూసే ఇతణ్ణి దారిలో పెట్టడానికి స్టాంప్‌ పేపర్‌ మీద అగ్రిమెంట్‌ రాసి సైన్‌ చేయించి ‘నెల రోజులు పాటు ఒక్క అబద్ధం చెప్పకూడదని’ కోరితే ఆ కోరికలోంచి కోటి నవ్వులు పుట్టడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకోవాలిలే.

అసలు ఈ వింత కోరికలు కోరే జాడ్యం మన హీరోలకు ముందు నుంచీ ఉంది. రాజ్యాభిషేకం చేస్తూ నీ కోరిక ఏమిటి నాయనా అని ‘జగదేక వీరుని కథ’లో ఎన్టీఆర్‌ను ముక్కామల అడిగితే ‘మీ పాద సేవ చేసుకోవడలై తండ్రీ’ అని అనకుండా అతడు గొప్పలు పోతూ ‘వెన్నెల రాత్రిలో కలువపూల పాన్పు మీద తాంబూలం సేవిస్తూ ఉంటే ఒక చెంత ఇంద్ర కుమార్తె, మరో చెంత వరుణ కన్య,  కనుల ముందు నాగకన్య, ఎదుట నాట్యం చేస్తూ అగ్నికూమారి’ఇలా నలుగురు సావాసకత్తెలు కావాలనే వింత కోరిక కోరి నీ దయ వల్ల క్లయిమాక్స్‌ సమయానికి ‘శివశంకరీ’ పాడి సాధిస్తాడనుకో. అక్కినేని మాత్రం తక్కువ తిన్నాడా. ‘తెనాలి రామకృష్ణ’లో మీ అమ్మ కాళికాదేవి దయతలిచి ఒక గిన్నెలో పాల రూపంలో ‘జ్ఞానం’, మరో గిన్నెలో పెరుగు రూపంలో ‘ధనం’ ఇచ్చి ఏది కావాలో కోరుకో అంటే చిటికెలో రెండూ మిక్స్‌ కొట్టి తాగి ‘నాకు రెండూ కావాలి ఇవ్వు’ అని రెటమతం కోరిక కోరితే ఆమెకు తిక్కరేగి ‘వికటకవిగా మిగులుతావు పో’ అని శపిస్తే ఆ వికటత్వంలో నీకెంతో ఇష్టమైన హాస్యాన్ని ఆ మహా కవి పుట్టించాడు కదా స్వామీ. ఆ నవ్వులు నేటికీ తలుచుకుంటున్నాము. అందుకు నీకు ఎన్ని అహ్హహ్హలూ ఓహ్హొహ్హోలు చదివించాలో.

సరే పోనీ... నిన్న మొన్న ‘బాహుబలి’లో ఏమైంది. ‘నేను ప్రేమించిన దేవసేనను నాకే ఇవ్వు రాజమాతా’ అని శివగామి విఎఫ్‌ఎక్స్‌ ఎలివేటెడ్‌ కళ్లలోకి బాహుబలి సూటిగా చూస్తూ కోరితే ఆమె ఏమి కోరింది.‘నీకు రాచపదవి కావాలా? ఆ దేవసేన కావాలా తేల్చుకో’ అని ఎదురు కోరింది. కోరికకు కోరికే సమాధానం అయినప్పుడు బాహుబలి దేవసేన చిటికెన వేలినే చటుక్కున పట్టుకున్నాడు రాజ్యం పోతుందన్న చీకూ చింత చీమంతైనా లేకుండా. అందుకే సాహోరే బాహుబలి అనిపించుకున్నాడు.

ఇలాంటి సీరియస్‌ కోరికలే కాకుండా గిలిగింతలు పెట్టే సిల్లీ కోరికలు కూడా ఉంటాయనుకో. ‘పడమటి సంధ్యారాగం’ సినిమా గుర్తుందిగా. అందులో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ఆసామికి పుట్టిన బకాసురుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దొరికే అన్ని ఆహార పదార్థాల మీదా దాడి చేసి గుటకాయ స్వాహా చేస్తుంటే ఆ తండ్రి కోరే కోరిక ఏమిటో తెలుసా? ‘కులాసా అని ఎవరైనా అడిగితే కులాసే. అంటే కుమారుడి వల్ల లాసు’ అని జవాబు చెప్పే పరిస్థితి కల్పించవద్దని. ‘చంటబ్బాయ్‌’లో శ్రీలక్ష్మి కోరిక కూడా చిన్నదే. ‘నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా’ అని వ్రాసే ఆమె యొక్క కవితా ఖండికల్ని అచ్చులో చూసుకోవాలనేగా.‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అలీ కోరిక కూడా చిన్నది. ‘ఎంద పరంద ఇన్న చేటా’ అంటూ అతడు బ్యాంకు మేనేజర్‌ బ్రహ్మానందం చుట్టూ తిరిగి అర్థం కాని భాషలో కోరే కోరిక ఒక్కటే –‘చేటల వ్యాపారం చేసుకుంటాను. లోను ఇమ్మని’.స్వామీ. సినిమాల్లో ఎన్నో కోరికలు చూశాము.ఆ కోరికలు తీరుతుంటే సంతోషపడ్డాము.కాని కొన్ని కోరికలు మాత్రం నువ్వు తీర్చనందుకు కొంచెం నిష్టూరం కూడా ఉంది.

‘అంతులేని కథ’లో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకున్న జయప్రద కోరిక నువ్వు తీర్చలేదు. నేషనల్‌ డాన్స్‌ ఫెస్టివల్‌లో ఢిల్లీలో డాన్స్‌ చేయాలన్న కమలహాసన్‌ కోరికను ‘సాగర సంగమం’లో నువ్వు తీర్చలేదు. భర్త చనిపోయాక పిల్లలను తానుగా చూసుకుందామనుకున్న మాధవి కోరికను ‘మాతృదేవోభవ’లో నువ్వు తీర్చలేదు. అన్న ఆది పినిశెట్టిని నాయకుడిగా చూసుకోవాలనుకున్న తమ్ముడు రామ్‌చరణ్‌ కోరికను ‘రంగస్థలం’లో నువ్వు తీర్చలేదు. లేటెస్టుగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ముప్పై అడుగుల నీ బొమ్మను తయారు చేసి మార్కులు కొట్టేయాలనుకున్న నత్తి రామ్మూర్తి కోరికను నువ్వు తీర్చలేదు. ఇక మీదట సినిమాల్లో ఏ కోరికకూ విఘ్నం కలిగించవద్దు. అవిఘ్నంగా సినిమా కోరికలన్నీ తీరే వరం ప్రసాదించు స్వామీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement