లూథియానా: పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నలుపు రంగులో ఉండే క్యారెట్ల రకాన్ని అభివృద్ధి చేశారు. ఇవి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయని, మరెన్నో పోషకాలను అదనంగా కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ ‘నల్ల’ క్యారెట్లకు ‘పంజాబ్ బ్లాక్ బ్యూటీ’ అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్త ఎస్.ధిల్లాన్ చెప్పారు. రక్తహీనత, కడుపులోని వివిధ అవయవాల వ్యాధులకు కారణమయ్యే హానికర రసాయనాలు, పదార్థాలను రక్తం నుంచి శుద్ధి చేసేందుకు ఈ ‘నల్ల’ క్యారెట్ తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఈ క్యారెట్లు మంచి ప్రత్యామ్నాయమని ధిల్లాన్ పేర్కొన్నారు. ఈ క్యారెట్లలో కెరోటిన్, ఫ్లేవనాల్‌లు, కాల్షియం, ఐరన్, జింక్‌లతో పాటు నాలుగు రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. నాటిన 93 రోజుల్లో ఈ ‘నల్ల’ క్యారెట్లు దిగుబడికి వస్తాయన్నారు.