కామిల్లా పిటాంగాతో డొమింగోస్
నదీ తీరంలో షూటింగ్ జరుగుతుండగా విరామంలో.. ఓ నటితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన నటుడు దుర్మరణం చెందాడు. బ్రెజిల్ టీవీ రంగంలో టాప్ యాక్టర్గా కొనసాగుతోన్న డొమింగోస్ మాంటెగ్నర్ అనూహ్యరీతిలో మృతిచెందిన ఉదంతం ఆ దేశంలో చర్చనీయాంశమైంది. లీగల్ మెడికల్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ కార్దోస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
బ్రెజిల్ ప్రఖ్యాత టీవీ సీరియల్ షూటింగ్ నిమిత్తం యూనిట్తో కలిసి గురువారం కానిండ్లే అనే గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామాన్ని ఆనుకునే సావ్ ప్రాన్సిస్కో నది ప్రవహిస్తూ ఉంటుంది. షూటింగ్ విరామంలో సహ నటి కామిల్లా పిటాంగాతో కలిసి డొమింగోస్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇద్దరూ జలకాలాటలలో మునిగిఉండగా.. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. ఒక బండరాయిని ఆసరాగా చేసుకుని కామిల్లా తననుతాను కాపాడుకోగా.. డొమింగోస్ మాత్రం నీటిలో కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది డొమింగోస్ కోసం గాలింపుచర్యను చేపట్టారు. ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, అంటే శుక్రవారానికి డొమింగోస్ మృతదేహాం లభ్యమైంది. గల్లంతైన ప్రదేశానికి 1000 అడుగుల దూరంలో నీటి అడుగున 60 అడుల లోతులో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన డొమింగోస్ మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీశామని కార్దోస్ లీగల్ మెడికల్ అధికారి జోస్ చెప్పారు. నిజానికి వారు నదిలోకి దిగిన చోటు ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
డొమింగోస్తొ కలిసి ఈతకు వెళ్లి తృటిలో ప్రాణాలు చేజిక్కించుకున్న నటి కామిల్లా ప్రమాదాన్ని వివరిస్తూ..'సరదాగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా నీళ్లొచ్చాయి. ఇద్దరం కొట్టుకుపోయాం. అయితే నాకొక బండరాయి ఆసరా దొరికింది. దానిపైకి ఎక్కి డొమింగోస్ కు చెయ్యి అందించే ప్రయత్నం చేశా. రెండు సార్లు దాదాపు దగ్గరగా వచ్చినా లాభం లేకపోయింది'అని చెప్పారు. 54 ఏళ్ల డొమింగోస్ సర్కర్ కళాకారుడిగా ప్రారంభమై, నాటక రంగంలో రాణించి, ఆపై టీవీ రంగంలో పేరు సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.