
రోదిస్తున్న శరత్ తండ్రి సతీశ్
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): ‘కొడుకా.. ఒక్కగానొక్కడివి.. అల్లారు ముద్దుగా పెంచితిమి.. మంచి సదువులు సదివి ముసలోల్లమయ్యాక మమ్మల్ని సాకుతవని ఆశపడ్తిమి.. నీ మీద ఎన్నో కలలు కంటిమి.. మధ్యల నువ్ గిట్ల జేత్తివి బిడ్డా.. ఇక మేం ఎవరి కోసం బతుకుడు బిడ్డా’ అంటూ మారంపెల్లి శరత్ తండ్రి మారంపెల్లి సతీశ్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తుమ్మెనాలకు చెందిన మారంపెల్లి శరత్(12,) పవ్బం నవదీప్(12), యాదాద్రి భువనగిరి జిల్లా దాసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13) ఆదివారం ఈతకోసమని పాఠశాల సమీపంలోని చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన విషయం విదితమే.
కన్నకొడుకు చనిపోయాడనే సమాచరం అందుకున్న సతీశ్.. బెహరాన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక, కొడుకు, భార్యను సాకేందుకని సురేశ్ 4నెలల క్రితమే బెహరాన్ వెళ్లాడు. అతడి భార్య రజిత గ్రామంలో కూలీ పనులు చేస్తూ కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం చెరువులోకి వెళ్లి కొడుకు మృతి చెందడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. బెహరాన్ నుంచి వచ్చిన సురేశ్.. ప్రీజర్‌లో ఉంచిన కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశాడు.
ఉపాధ్యాయుల సంతాపం
ముగ్గురు విద్యార్థుల మృతికి ప్రధానోపాధ్యాయుడు గాదె శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.
విషాదంలో నవదీప్ కుటుంబం..
కిషన్ – పుష్పలత దంపతులకు కుమారుడు పబ్బతి నవదీప్, ఓ కూతురు ఉంది. కిషన్ ఉ పాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతడు మంగళవారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది. నవదీప్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచా రు. తండ్రి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేస్తారు. మృతి చెందిన మరో విద్యార్థి గొలు సుల యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment