‘బ్లూస్టార్’లో మా పాత్ర పరిమితం
లండన్: అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో తమ ఆర్మీ పాత్ర చాలా పరిమితమని, అది పూర్తిగా సలహాపరమైందేనని బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ స్పష్టం చేశారు. వాస్తవ ఆపరేషన్‌లో బ్రిటన్ ఎలాంటి పాత్రా పోషించలేదని మంగళవారం పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రకటించారు. ‘బ్లూస్టార్’ ప్రణాళిక తొలి దశలో తాము చేసిన సాయం ఆపరేషన్‌పై అతికొద్ది ప్రభావం మాత్రమే చూపిందని అన్నారు. సిక్కు మిలిటెంట్లను తరిమికొట్టేందుకు జరిపిన బ్లూస్టార్‌కు అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్, నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి సాయం అందించారన్న ఆరోపణలపై కేబినెట్ కార్యదర్శి జెరేమీ హేవుడ్ ఇచ్చిన దర్యాప్తు నివేదిక వివరాలను హేగ్ సభకు వెల్లడించారు. ఆ వివరాలు..
మిలిటెంట్లపై చర్య కోసం అత్యవసర ప్రణాళికలు రచిస్తున్న భారత నిఘా అధికారులకు, ప్రత్యేక బృందానికి సలహా ఇచ్చేందుకు ఒకే ఒక్క బ్రిటన్ ఆర్మీ సలహాదారు 1984 ఫిబ్రవరి 8-19 మధ్య భారత్‌కు వెళ్లారు. మిలిటెంట్లతో సంప్రదింపులు విఫలమయ్యాకే చివరి పరిష్కారంగా సైనిక చర్య తీసుకోవాలని ఆయన చెప్పారు. ఆకస్మిక చర్యలు తీసుకోవాలని, మరణాలను తగ్గించేందుకు హెలికాప్టర్‌లో బలగాలను పంపాలని సూచించారు. అయితే బ్లూస్టార్‌ను ఆకస్మికంగా కాకుండా పదాతి దళాలే చేశాయి. 200 ఫైళ్లు, 23 వేల పత్రాలను విశ్లేషించాక ఈ విషయం తెలిసింది.
సలహాదారు 1984 ఫిబ్రవరిలో సిఫార్సులు చేయగా మూడు నెలల తర్వాత జూన్‌లో జరిగిన ఆపరేషన్ వాటికి భిన్నంగా సాగింది.
బ్లూస్టార్ పథకం, అమలులో తమకెవరూ సాయం చేయలేదని ఇటీవల ఆ ఆపరేషన్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జెనరల్ బ్రార్ చేసిన ప్రకటన దీనికి తగినట్లే ఉంది. బ్లూస్టార్‌పై థాచర్‌కు, ఇందిరలకు మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలూ ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి.
ఆపరేషన్‌లో బ్రిటన్ ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. ఆయుధ సామగ్రి, శిక్షణ కూడా అందించలేదు.
బ్లూస్టార్‌పై పార్లమెంటును ఏమార్చి ఉంటారని, ఇందులో బ్రిటన్ వాణిజ్య ప్రయోజనాలు(రక్షణ సామగ్రి అమ్మకాలు) ఉన్నాయేమోనన్న సిక్కుల ఆరోపణకు ఆధారాలూ లభించలేదు.
కాగా, ఈ దర్యాప్తు పరిధిని స్వల్పకాలానికి పరిమితం చేశారని బ్రిటన్‌లోని సిక్కు సంఘాలు విమర్శించాయి. బ్రిటన్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ ఉన్నాతాధికారి ఒకరు బ్లూస్టార్‌కు సంబంధించి భారత్ సందర్శించారని ఇటీవల వెలుగు చూసిన రహస్య పత్రాల్లో ఉండడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ ఈ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, దర్యాప్తు నివేదిక వివరాలను బ్రిటన్ తమతో పంచుకుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.