‘ఖుషి’ రికార్డును ఈ జంట బద్దలుకొట్టింది! | Britain biggest family, The Radfords welcome the arrival of their 19th baby | Sakshi
Sakshi News home page

‘ఖుషి’ రికార్డును ఈ జంట బద్దలుకొట్టింది!

Published Thu, Jul 28 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

‘ఖుషి’ రికార్డును ఈ జంట బద్దలుకొట్టింది!

‘ఖుషి’ రికార్డును ఈ జంట బద్దలుకొట్టింది!

‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ గుర్తుందా.. అప్పటివరకు కొట్టుకుంటూ, కీచులాడుకుంటున్న సిద్ధు-మధుమతి క్లైమాక్స్‌లో పెళ్లిచేసుకొని ఏకంగా 17మంది పిల్లల్ని కంటారు. మళ్లీ మధుమతి ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. ఆ సినిమాను ఈ బ్రిటన్‌ దంపతులు చూశారో-లేదో తెలియదు కానీ, పిల్లల విషయంలో మాత్రం ‘ఖుషి’ రికార్డును వీరు బద్దలుకొట్టారు.

బ్రిటన్‌లోనే అత్యంత పే..ద్ద కుటుంబంగా పేరొందిన స్యూ రాడ్‌ఫోర్డ్‌-నియోల్‌ కుటుంబంలోకి తాజాగా 19వ చిన్నారి వచ్చి చేరింది. ఇప్పటికే 18 మంది పిల్లల్ని కన్న ఈ దంపతులు తాజాగా 19వ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నెలలో స్యూ రాడ్‌ఫోర్డ్‌ (41) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఫొయెబె విల్లో అని పేరుపెట్టారు. నిజానికి 2015 జూన్‌లో 18వ బిడ్డ హాలీ ఆల్ఫియా బ్యూకు జన్మనిచ్చిన తర్వాత ఇంక పిల్లలు కనడం మానేయాలని ఈ దంపతులు నిర్ణయానికొచ్చారు. కానీ, 19వ బిడ్డ పుట్టిన తర్వాత పిల్లల సంఖ్యను 20కి చేర్చాలని వీరు భావిస్తున్నారట. సొంత బేకరీని నడుపుకుంటూ ఈ పెద్ద కుటుంబభారాన్ని నియోల్‌ దంపతులు మోస్తున్నారు. రాడ్‌ఫోర్డ్‌ 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తొలిసారి గర్భవతి అయింది. ఆ తర్వాత వరుసగా పిల్లల్ని కంటూ వస్తున్న ఆమె.. తమ పిల్లల సంఖ్య 20 ఉంటే బాగుంటుందని బంధుమిత్రులు అంటున్నారని, కాబట్టి మరో బిడ్డను కనే అవకాశముందని చెప్పారు.


రాడ్‌ఫోర్డ్‌-నియోల్‌ దంపతులకు క్రిస్‌ (27), సోఫీ (22), క్లోయి (21), జాక్‌ (19), డానియెల్‌ (17), ల్యూక్‌ (15), మిల్లీ (15), కేటీ (13), జేమ్స్‌ (12), ఎల్లీ (11), ఐమీ (10), జోష్‌ (9), మాక్స్‌ (7), టిల్లీ (6), ఆస్కార్‌ (4), కాస్పర్‌ (3), హల్లీ (13 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. వీరికి ఎల్ఫీ అనే ఆడబిడ్డ పుట్టినప్పటికీ 21వారాల వయస్సులో తను చనిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం పుట్టిన ఫొబెను 19వ బిడ్డగా వారు భావిస్తున్నారు. గంపెడు పిల్లల్ని పెంచేందుకు ఈ దంపతులకు ఏడాదికి రూ. 26.56 లక్షల వరకు ఖర్చు అవుతున్నదట. అయినా ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారపడకుండా సొంతంగానే వీరు పిల్లల్ని పెంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement