బ్రిటన్ యువరాణి డయానాది హత్యా?
లండన్: బ్రిటన్ యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించలేదా? ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? అందులో ఆ దేశ మిలటరీ పాత్ర కూడా ఉందా? ఈ అనుమానాలకు అవకాశమిస్తున్న ఒక సమాచారంపై బ్రిటన్‌కు చెందిన స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
1997 ఆగస్టు 31న డయానా, ఆమె ప్రియుడు అల్‌ఫాయెద్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని, ఆమెను హత్య చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెండు సార్లు విచారణ జరిపిన ప్రభుత్వం.. అది ప్రమాదమేనని తేల్చింది.
కానీ, ఈ సారి మాత్రం అప్పట్లో సైన్యంలో పనిచేసిన ఓ అధికారి.. ‘డయానాను హత్యచేసేందుకు మా యూనిట్ ఏర్పాట్లు చేసింది. అందువల్లే దానిని దాచాల్సి వచ్చింది’ అని తన భార్యతో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ వివరాలను పేర్కొంటూ ఆ సైనికుడి అత్త, మామ కమాండింగ్ అధికారికి లేఖ రాశారు. ఈ సమాచారంలో విశ్వసనీయతను పరిశీలిస్తున్నామని స్కాట్‌లాండ్ యార్డ్ సీనియర్ పోలీసు అధికారి బెర్నార్డ్ హోగన్ చెప్పారు.