పుతిన్.. ఆ పాముతో దోస్తీ మానుకో!
- రష్యాకు బ్రిటన్ స్ట్రాంగ్ వార్నింగ్
లండన్: సొంత ప్రజలపై రసాయనికదాడులకు పాల్పడిన సిరియా ప్రభుత్వానికి నిర్విరామంగా మద్దతు పలుకుతోన్న రష్యాకు.. బ్రిటన్ గట్టి హెచ్చరిక చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను విషపూరిత జీవిగా పోల్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్.. ‘పుతిన్.. ఇప్పటికైనా ఆ పాముతో స్నేహం మానుకో’ అని హితవుపలికారు. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారమే రష్యాకు వెళ్లాల్సిన బోరిస్ ఉన్నపళంగా తన పర్యటనను రద్దుచేసుకునిమరీ పుతిన్‌పై విమర్శలు గుప్పించడం గమనార్హం.
తిరుగుబాటుల ఆధీనంలోని ఖాన్ షిఖౌన్ పట్టణంలో గతవారం సిరియా సైన్యం జరిపిన రసాయనిక దాడిలో 89 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ చర్యను గర్హించిన అమెరికా.. శుక్రవారం తెల్లవారుజామున సిరియా వైమానిక స్థావరంపై మిస్సైళ్లతో దాడిచేసింది. దీంతో ఇన్నాళ్లూ పరోక్షంగా సాగిన పోరు.. ప్రత్యక్ష యుద్ధంగా మారినట్లయింది. అయితే రష్యా మాత్రం ఎప్పటిలాగే సిరియా సర్కారును వెనకేసుకొచ్చింది. సైన్యం రసాయనికదాడి చేయలేదని, రెబల్స్ దాచిపెట్టిన రసాయనాలు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చింది.
నేడు జీ-7 దేశాల కీలక భేటీ..
సిరియా విషయంలో రష్యా పాత్రను కట్టడిచేసేలా వివిధ వేదికలు పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం ఇటలీలో జీ-7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కీలక తీర్మానాలు ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ వేదికపై నుంచి రష్యాకు మరింత తీవ్రంగా హెచ్చరికలు పంపాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి.
రేపు రష్యాకు అమెరికా విదేశాంగ మంత్రి
ఒకపైపు సిరియా కేంద్రంగా పోటాపోటీ తలపడుతున్న అమెరికా-రష్యాలు మరోవైపు దౌత్యపరమైన సంబంధాల పునరుద్ధరణపై దృష్టిసారించాయి. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ మంగళవారం మాస్కోలో పర్యటించనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలతోపాటు ప్రస్తుత తరుణంలో కీలకంగా మారిన సిరియా పరిణామాలపైనా చర్చలు జరపనున్నట్లు సమాచారం.