పార్లమెంట్ లోయర్ హౌస్ లో ఆవేశంగా ప్రసంగిస్తున్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్
- ఐఎస్పై సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉంటుందన్న కామెరూన్
- పార్లమెంట్లో మద్దతుకు యత్నం.. ప్రతిపక్షపార్టీలో చీలిక
లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్య అంశం బ్రిటన్ పార్లమెంట్ ను కుదిపేస్తున్నది. యుద్ధానికి ఇదే సరైన సమయమని అధికార పక్షం, అసలు యుద్ధమే వద్దంటూ ప్రతిపక్షం వాదులాడుకున్నాయి. ఈ మేరకు గురువారం బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువ సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని డేవిడ్ కామెరూన్ విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేశారు.
సిరియాలో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్యకు ఇదే తగిన సమయమని, కేవలం అలాంటి చర్యలతోనే బ్రిటన్ సురక్షితంగా మనగలుగుతుందని కామెరూన్ అన్నారు. ఐఎస్ పై సైనికచర్యతో.. ఇప్పట్లోగానీ, భవిష్యత్లోగానీ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఉద్ఘాటించారు.ఈ మేరకు రూపొందించిన నివేదికను పార్లమెంట్ సభ్యులకు అందజేస్తూ.. మద్దతు పలకాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని కోరారు.
ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్.. ప్రభుత్వ ప్రతిపాదనను నిర్దంద్వంగా తిరస్కరించారు. సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉండగలదన్న ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. కామెరూన్ తన ప్రతిపాదనను విరమించుకోవాలని హితవుపలికారు. అయితే సైనిక చర్య వ్యవహారం లేబర్ పార్టీ రెండుగా చీలిపోయింది. నాయకుడు కోర్బెయిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు ఎంపీలు ప్రకటనలు చేశారు. సైనిక చర్య తప్పదన్న ప్రభుత్వ వాదనను సమర్థించారు. దీంతో కొర్బెయిన్ ఇరుకునపడ్డట్లయింది. మరోవైపు మాజీ ప్రధాని, లేబర్ పార్టీకే చెందిన టోనీ బ్లేయర్ కూడా డేవిడ్ కామెరూన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.