సాహసం సేయకురా డింభకా!
బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన ఆంటోని బ్రిట్టన్ (38) ఓ స్టంట్ మాస్టర్. చిన్నప్పటి నుంచే సాహసాలు చేయడమంటే ఇష్టం. కాళ్లు చేతులు కట్టివేయించుకొని నదిలోకి దూకడం, తల్లకిందులుగా మండే తాడుకు వేలాడుతూ అది కాలి తెగేలోపే సురక్షితంగా భూమికి దిగడం, బోనులో బంధించుకొని దాన్ని సముద్రంలో ముంచడం... ఇలాంటి ఫీట్లు చేస్తుంటాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయినప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా సాహసాలు చేస్తుంటాడు. కిందటి శనివారం ఇలాగే మనోడు ఓ సాహసం తలపెట్టాడు. ఆరడుగుల లోతు గొయ్యి తవ్వించుకొని దాంట్లో ‘సజీవ సమాధి’ అవ్వాలనుకున్నాడు.
మీరు చదివింది నిజమే. ఎందుకంటే తృటిలో చావు తప్పి కన్నులొట్ట బోయింది. జనం చూస్తుండగా ఆంటోని బ్రిట్టన్‌ను గొయ్యిలో పడుకోబెట్టి మట్టి కప్పేశారు. చేతులతోనే మట్టి తొలగించుకొని... ఊపిరి ఆగేలోగా బయటపడాలి. బాగానే ప్రాక్టీసు చేసినా... ఈసారి పాపం బయటపడలేకపోయాడు. నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు సమాధిలో ఎలాంటి కదలిక లేదు.
అనుమానం వచ్చిన సహాయ సిబ్బంది రంగంలోకి దిగి... గబగబా సమాధిని తవ్వేశారు. లోపల చూస్తే అచేతనంగా ఆంటోని. నోరు, ముక్కు నిండా మట్టి. అంబులెన్స్ రెడీగా ఉంది కాబట్టి పారామెడిక్స్ ఆగిన అతని గుండె మళ్లీ పనిచేసేలా చేయగలిగారు. అలా మృత్యుముఖం దాకా వెళ్లొచ్చిన ఇతన్ని మరోసారి ‘సాహసం సేయకురా డింభకా’ అనాలేమో.