6 నెలల్లోగా బీఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూ
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చే ఆరు నెలల్లోగా స్టాక్ మార్కెట్లో నమోదు కానుంది. వాటాల ఉపసంహరణకు సంబంధించి అనుమతి కోరుతూ ఇప్పటికే సెబీకి దాఖలు చేశామని, అనుమతులు రాగానే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు బీఎస్‌ఈ మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూ పరిమాణం చెప్పలేమని, అది రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు ఉండొచ్చన్నారు.
సెబీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూపై స్పష్టత వస్తుందన్నారు. బీఎస్‌ఈలో 7,000 మందికిపైగా వాటాదారులు ఉన్నారు. అందులో 40 శాతం బ్రోకింగ్ కమ్యూనిటీకి సంబంధించినవాళ్లు ఉండగా, మరో 30 శాతం విదేశీ సంస్థలు ఉన్నాయి. షేర్లను వేలం వేయడం ద్వారా (ఆఫర్ ఫర్ సేల్) వాటాలను విక్రయించాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. ఇందుకోసం గత జనవరిలో సెబీకి దరఖాస్తు చేసింది.