‘ఇందిరమ్మ’ ఇళ్ల బడ్జెట్‌కు కోత | Budget Allocation cut to Indiramma housing scheme | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ ఇళ్ల బడ్జెట్‌కు కోత

Published Fri, Dec 6 2013 5:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

‘ఇందిరమ్మ’ ఇళ్ల బడ్జెట్‌కు కోత - Sakshi

‘ఇందిరమ్మ’ ఇళ్ల బడ్జెట్‌కు కోత

 పేదల గృహాలకోసం కేటాయించిన నిధుల్లో రూ. 500 కోట్లు స్వగృహ కాంట్రాక్టర్లకు మళ్లింపు
 ముఖ్యనేత సోదరుడి మంత్రాంగం
 మంత్రుల కమిటీ సిఫార్సుతో సీఎం అంగీకారం
 తొలి దశలో రీ-అప్రోప్రియేషన్ చేసి రూ. 246 కోట్లు విడుదల
 ఆర్థిక శాఖ జీవో జారీ

 
 సాక్షి, హైదరాబాద్:
పేదల గూడు కూల్చేసి స్వగృహ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. అధికార యంత్రాంగం అంగీకరించకపోయినా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం మంత్రివర్గ ఉప సంఘంతో సహా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందిరమ్మ గృహాల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.500 కోట్లను రాజీవ్ స్వగృహ కాంట్రాక్టర్ల చెల్లింపునకు మళ్లించేందుకు మంత్రివర్గ ఉపసంఘంతో సహా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో రాజీవ్ స్వగృహ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్ నుంచి రూ.246 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన రీ-అప్రోప్రియేషన్ ఫైలుపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగమేఘాల మీద సంతకాలు చేశారు. దీంతో తొలి దశలో ఇందిరమ్మ గృహాల బడ్జెట్ నుంచి రూ.246 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. ఈ రూ.246 కోట్ల విడుదలకు ముందుగానే రాజీవ్ స్వగృహ కోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా రూ.105 కోట్లను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు విడుదల చేసింది. ఈ మొత్తం మంత్రాంగం అంతా ముఖ్యనేత సోదరుడి ద్వారానే జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 కాంట్రాక్టర్లకోసం ఇందిరమ్మ నిధులు బదిలీ...
 పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరకు గృహాలను నిర్మించి ఇచ్చేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఇందుకోసం రాజీవ్ స్వగృహ ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ దరఖాస్తులతో పాటు ఒక్కొక్కరి నుంచి రూ. మూడువేల నుంచి రూ. ఐదువేల చొప్పున వసూలు చేసింది. ఆ విధంగా 1.75 లక్షల మంది నుంచి 70 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ ఆ తర్వాత కార్పొరేషన్ నిర్వహణ గాడి తప్పడమే కాకుండా దివాలా తీసింది. ఈ నేపథ్యంలో చాలామంది మాకు గృహాలు వద్దు డబ్బులు వెనక్కు ఇచ్చేయమని డిమాండ్ చేస్తుండగా ఇప్పటికి రూ.20 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా దరఖాస్తుదారుల గోడు పట్టించుకునే నాధుడే లేడు. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు మాత్రం ఇందిరమ్మ ఇళ్ల నిధులనుంచి రూ.246కోట్లు విడుదల చేయాలని సర్కారు సిఫార్సు చేయడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో గృహాలను నిర్మించి విక్రయించడం ద్వారా వచ్చిన నిధులను నిర్మాణ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే కార్పొరేషన్ దివాళా తీయడంతో మధ్యలో నిలిచిపోయిన  కేటగిరి-1, కేటగిరి-2 గృహాల నిర్మాణాలు పూర్తి చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రూ.105 కోట్లు విడుదల చేయాలని సిఫార్సు చేసింది.

ఆ మేరకు ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసింది. అయితే కేటగిరీ-2 నిర్మాణాలు పూర్తి కాలేదని, మరో రూ.500 కోట్లు అవసరమని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

 

ఈ మేరకు తొలి దశలో రూ.246 కోట్లను, మలి దశలో మిగతా నిధులను ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్‌నుంచి విడుదల చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. దరఖాస్తుదారులు మా డబ్బులు వెనక్కు ఇచ్చేయమని అడుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం స్వగృహ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించేందుకు ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుందని, కమిషన్ల కోసమే ఇటువంటి చర్యలకు ముఖ్యనేతలు పాల్పడుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవైపు పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రచ్చబండలో లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు అదే పేదలకు చెందిన ఇళ్ల బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కోత విధించి స్వగృహ కాంట్రాక్టర్లకు మళ్లించడం చూస్తుంటే పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాంట్రాక్టర్ల లాబీయింగ్‌తో ప్రభుత్వ పెద్దలు పేదల గృహాల బడ్జెట్ నిధులకు తూట్లు పొడిచి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement