పసిడి ధర పెరుగుతోంది కానీ...
పసిడి ధర పెరుగుతోంది కానీ...
Published Fri, Sep 30 2016 4:02 PM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజూ పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.175లు ఎగిసి రూ.31,525గా నమోదవుతోంది.అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు, దేశీయ మార్కెట్లో ఆభరణాల వ్యాపారులు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేపడుతుండటంతో ఈ ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మరో విలువైన మెటల్ వెండి ధరలు మాత్రం పడిపోతున్నాయి. కేజీ వెండి ధర 50 రూపాయలు కిందకి దిగజారి రూ.45,500గా నమోదవుతోంది. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీ దారుల నుంచి కొనుగోలు మద్దతు లేకపోవడంతో వెండి ధరలు కిందకి దిగివస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం పెరుగుతుందనే వార్తలు రావడంతో బులియన్ మార్కెట్లో సెంటిమెంట్ బలపడిందని ట్రేడర్స్ వెల్లడిస్తున్నారు. డ్యుయిస్ బ్యాంకు ఫైనాన్స్ ఈక్విటీల్లో ఆందోళనలు పెరగడంతో, బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావించి పెట్టుబడుల జోరు పెంచుతున్నారు. సింగపూర్లో బంగారం ధర 0.4 శాతం పెరిగి ఒక ఔన్స్కు 1,325.45 డాలర్లుగా నమోదవుతోంది. అదేవిధంగా దేశీయ మార్కెట్లో కూడా ఆభరణాల వ్యాపారులు కొనుగోలు పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరలు రూ.175లు ఎగిసి రూ.31,525, రూ.31,375గా నమోదవుతున్నాయి.
Advertisement
Advertisement