బెంగళూరు గ్రామీణ,మండ్య లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. అయా నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే బారులు తీరారు. ఆ ఉప ఎన్నికలు రాష్ట్రమంతా తీవ్ర కుతూహలం రేపుతున్నాయి. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌లు గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి.
తన ఆధీనంలోని ఈ స్థానాలను నిలబెట్టుకోవాలని జేడీఎస్, ఆరు నూరైనా స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో బద్ధ శత్రువులైన మాజీ మంత్రి డీకే. శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిల వ్యక్తిగత ప్రతిష్టకు ఈ ఉప ఎన్నిక సవాలుగా మారింది. శివకుమార్ తమ్ముడు సురేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా, కుమారస్వామి సతీమణి అనిత జేడీఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రెండు స్థానాల్లో గెలుపొంది పార్టీకి ‘నూరు రోజుల కానుక’ ఇవ్వాలనుకుంటున్నారు. పూర్వాశ్రమంలో తమతో ఉన్న సిద్ధరామయ్య వైరి పక్షంలో చేరి ఏకంగా సీఎం పదవిని అలంకరించడాన్ని జీర్ణించుకోలేని జేడీఎస్, తన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం ద్వారా ఆయనను అశాంతికి గురి చేయాలనే లక్ష్యంతో ఉంది.
కాగా బెంగళూరు గ్రామీణలో 2070 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలీసులు కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శనివారం ఓట్ల లెక్కింపు చేపడతారు.
కర్నాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Published Wed, Aug 21 2013 8:37 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement