నాకెవరు సంస్కారం నేర్పాల్సిన పనిలేదు
బెంగళూరు : సుమలత అంబరీశ్‌పై తరచూ విమర్శలు చేసే జేడీఎస్‌నేత, రవాణా మంత్రి తమ్మణ్ణ మరోసారి వాగ్బాణాలు సంధించారు. దివంగత మాజీ మంత్రి అంబరీశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటికి వెళ్లిన ప్రజలు, నేతల్లో ఎంతమందిని సుమలత పలకరించారు, ఎంతమందికి కనీసం తాగడానికి నీళ్లిచ్చారు? అని రవాణాశాఖ మంత్రి, జేడీఎస్ నేత డీసీ తమ్మణ్ణ అన్నారు. గురువారం మద్దూరు తాలూకా అతగూరు హోబళి మాచహళ్లి, కంప్లాపుర, కూళగెరె, కబ్బారె తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడారు. అంబరీశ్ ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న జిల్లా ప్రజల, రైతుల గురించి సుమలత ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం అంబరీశ్ పేరు చెప్పుకొని ప్రజలను ఉద్ధరిస్తామంటూ మాటలు చెబుతున్నారని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత కూడా ఇటువంటి మాయమాటలు చెప్పే ఎంపీగా పోటీ చేసి గెలిచాక మండ్య జిల్లా ప్రజలను మధ్యలోనే వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారంటూ పరోక్షంగా నటి రమ్యపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలంటూ సుమలతపై తామేమి ఒత్తిడి చేయబోమని, పోటీ అనేది ఆమె వ్యక్తిగత విషయమన్నారు. ఎవరో వందమంది జనాలు నాలుగు బస్సుల్లో బెంగళూరుకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పిలిచినంత మాత్రానా జిల్లా ప్రజలంతా పిలిచినట్లుగా సుమలత భ్రమ పడుతున్నారన్నారు. 18 లక్షల మంది ఓటర్లు ఉన్న మండ్య జిల్లాను అభివృద్ధి చేయాల్సిన వారే చేస్తారు తప్ప ఇతరులు అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. నిఖిల్ కుమార స్వామి రక్తంలోనే రాజకీయం ఉందని, రాజకీయాల్లో అడుగుపెట్టడానికి నిఖిల్‌కు అనుభవం అవసరం లేదన్నారు.
అర్థంపర్థం లేకుండా మాట్లాడొద్దు : సుమలత
అతిథులను ఎలా గౌరవించాలో, ఎలా సత్కరించాలో అంబరీశ్ కుటుంబానికి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, అంతటి దుస్థితి మాకు పట్టలేదు అని మంత్రి తమ్మణ్ణ చేసిన వ్యాఖ్యలకు సుమలత కౌంటర్ ఇచ్చారు. మంత్రి తమ్మణ్ణ ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చారో, ఎన్నిసార్లు నీళ్లు తాగారో అదే విధంగా తాము తమ్మణ్ణ ఇంటికి ఎన్నిసార్లు వెళ్లామనే వివరాలను ఆయన కుటుంబ సభ్యులే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే నేరుగా తమకు చెప్పకుండా ఈ విధంగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ‘అంబరీశ్ పేరు చెప్పుకొని ఎవరెవరు ఏమేం పొందారో, ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికి తెలుసు. అర్థం లేని విధంగా విమర్శలు చేయడం వారి సంస్కారం. మాట్లాకుండా మౌనంగా ఉండడం మా సంస్కారం. అంబరీశ్ ఉన్న సమయంలో ఎవరెవరూ మా ఇంటికి వచ్చారో, మేము ఎవరింటికి వెళ్లామో ప్రతీ ఒక్కరికీ తెలుసు. దీనిపై మేము వ్యాఖ్యానించదలచుకోలేదు’ అన్నారు.
సీఎం తనయుడూ రంగులు వేసుకున్నవాడే
ముఖాలకు రంగులు వేసుకునే వ్యక్తులను నమ్మొద్దంటూ డీసీ తమ్మణ్ణ చేసిన వ్యాఖ్యలపై సుమలత స్పందిస్తూ.. ముఖానికి రంగులు వేసుకున్న ఎవరూ రాజకీయాల్లో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. మండ్యలో జేడీఎస్ తరపున పోటీ చేయనున్న నిఖిల్ కూడా ముఖానికి రంగులు వేసుకునే వ్యక్తేనని ,సీఎం కుమారస్వామి కూడా ముఖానికి రంగులు వేసుకునే సినిమా రంగంలోనే చాలా ఏళ్లు ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు.