అప్పు తీసుకుంటే.. ఇక అంతే! | call money brokers hulchul in vijayawada | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకుంటే.. ఇక అంతే!

Published Sun, Dec 13 2015 10:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

అప్పు తీసుకుంటే.. ఇక అంతే!

అప్పు తీసుకుంటే.. ఇక అంతే!

  • కొత్త రకం దాదాగిరి
  • దాదాపు వందమంది మహిళలు బలి
  • ఐదేళ్లుగా కాల్‌మనీ ముఠా రాక్షస క్రీడ
  •  
    విజయవాడ సిటీ: ‘కాల్‌మనీ వడ్డీ చెల్లింపు రెండు రోజులు ఆలస్యమైతే ఫోనొస్తుంది. ఫోనెత్తకుంటే నేరుగా ఇంట్లోని మహిళల మొబైల్స్‌కు వాట్సప్‌లో కండలు తిరిగిన యువకుల ఫొటోలు వస్తాయి. లేదంటే వారి ఫోన్లకు అసభ్య పదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపుతారు. వీలుంటే ఈ మెయిల్స్ ను కూడా వాడుకుంటారు.
     
    అదేంటని ప్రశ్నిస్తే కఠిన దండనే’నని కొందరు బాధితులు టాస్క్‌ఫోర్స్ పోలీసుల వద్ద ఏకరువు పెట్టుకున్నారు. మరికొందరు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయం పై కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన యలమంచిలి రాము ముఠా సెక్స్ రాకెట్‌పై అటు పోలీసులు, ఇటు టాస్క్‌ఫోర్స్ అధికారులు అన్ని కోణాల్లో విచారణజరుపుతున్నారు.
     
    బెదిరించి.. లొంగదీసుకుని..
    ఐదేళ్లుగా సాగుతున్న యలమంచిలి రాము ముఠా రాక్షస క్రీడకు వందమంది వరకు మహిళలు బలయ్యారు. అనేకమంది ఆస్తులు కోల్పోయి నిరాశ్రయుల య్యారు. వీరి వద్ద అప్పు తీసుకున్న వారు ఇక బయట ప డటం కష్టమని పోలీసు అధికారులు చెపుతున్నారు. ఏళ్లు గడిచినా వడ్డీ మినహా అసలు తీరదు. ఎవరైనా రూ.4 లక్షలు అప్పుగా తీసుకుంటే రోజుకు రూ.4వేలు వడ్డీ కింద చెల్లించాలి. అంటే నెలకు వడ్డీనే లక్షా 20 వేల రూపాయలు. ఇక అసలు ఏవిధంగా తీరుతుందనేది ప్రశ్నార్థకమే.
     
    అప్పు ఇచ్చే సమయంలోనే పదేసి చొప్పున ఖాళీ ప్రాంశరీ నోట్లు, చెక్కులు తీసేసుకుం టారు. ఇదే సమయంలో ఇంట్లోని మహిళలు, చదువుకునే యువతులు ఉంటే వారి మొబైల్ నంబర్లు తీసుకుంటారు. వడ్డీ చెల్లింపులో జాప్యం జరిగితే మహిళలను వేధింపులకు గురిచేస్తుంటారు.
     
     ఆపై వారిని నయానో, భయానో లొంగదీసుకొని తమతో పాటు మరికొందరి కామవాంఛ తీర్చుకుంటారు. వీరి వలకు చిక్కిన తర్వాత ఇక బెదిరింపులు మొదలవుతాయి. తాము చెప్పిన వారి వద్దకు వెళ్లడంతో పాటు తాము కోరినవారిని తీసుకురమ్మంటూ వేధిస్తుంటా రు. లేదంటే అంతకుముందే తీసిన వీడియో లు, ఫొటోలు బహిర్గతం చేస్తామంటూ బెది రిస్తారు. ఆ విధంగా వారు నిరాటంకంగా సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
     
    డీఈ వాంఛకు విద్యార్థిని బలి
    ఎలక్ట్రికల్ డీఈ సత్యానందం కామవాంఛకు ఓ విద్యార్థిని బలైనట్టు పోలీసు వర్గాలు చెపుతున్నాయి. నెల రోజుల కిందట ఓ విద్యార్థినిని పార్టీ పేరిట ఖరీదైన హోటల్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేయగా కుటుంబ సభ్యులు నిలదీశారని తెలుస్తోంది. దీంతో రాము ముఠా పంచాయితీ చేసి రూ.50 వేలు ఇచ్చినట్టు సమాచారం.  ఈ విషయం బయటకు పొక్కితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగడంతో చేసేది లేక ఆ కుటుంబ సభ్యులు మిన్నుకుండిపోయారని తెలుస్తోంది.
     
    పదేళ్లుగా వ్యాపారం
    హనుమాన్‌జంక్షన్ సమీప గ్రామానికి చెందిన యలమంచిలి రాము పన్నెండేళ్ల కిందట నగరానికి వచ్చాడు. తన భావాల కు దగ్గరగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్, ఎలక్ట్రికల్ డీఈ సత్యానందం తదితరులతో కలిసి పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో పదేళ్ల కిందట వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వారి వ్యాపారంలో మరికొందరు భాగస్వాములుగా చేరారు. గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధుల దన్నుతో వీరు రెచ్చిపోతున్నారు. తాము చెప్పిందే వేదమనే రీతిలో వ్యవహరిస్తున్న ఈ ముఠా అనేక మందిని ఆర్పేసి కోట్లాది రూపాయలు పోగేసింది. ప్రజాప్రతినిధు లు కూడా వడ్డీ సక్రమంగా అందుతుండటంతో వీరికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు.
     
    బ్రోకర్లదే కీలక భూమిక
    మహిళలను లోబరుచుకునే ముఠాకు కస్టమర్లను తీసుకురావడంలో బ్రోకర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. అధిక మొత్తంలో అవసరమైన వారిని గుర్తించి వీరి వద్దకు తీసుకొస్తుంటారు. తద్వారా అవసరమైన మేర నగదు ఇప్పిస్తారు. ఇందుకు నూటికి రూ.5 వీరికి కమిషన్‌గా ముడుతుంది. పైగా పండుగలకు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు ఇస్తుంటారు.

    పైకి అప్పు తీసుకునే వ్యక్తి తరఫున వచ్చినట్టు నటించినా యలమంచిలి రాము ముఠాకు ఏజెంట్లుగా వీరు వ్యవహరిస్తుంటారని చెపుతున్నారు. నగర వ్యాప్తంగా వీరి బ్రోకర్ల నెట్‌వర్క్ విస్తరించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో వీరు తమ పలుకుబడిని పెట్టుబడి పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. కొందరు చోటామోటా నేతలు కూడా వీరి వద్దకు డబ్బు అవసరమైన వారిని తీసుకొచ్చిన వారిలో ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement