
విద్యార్థులకు కెనడా తీపి కబురు
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఆశావహులకు ఆ దేశం తీపి కబురు చెప్పింది. ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్ పేరుతో కెనడాలో విద్యను పూర్తిచేసుకునే విదేశీ విద్యార్ధులకు, అక్కడి కంపెనీల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు దేశ పౌరసత్వాన్ని మరింత తొందరగా అందించేందుకు నిబంధనలను సడలించింది.
సడలించిన ఇమిగ్రేషన్ నిబంధనలు ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ నుంచి కెనడాలో విద్యను అభ్యసిండానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు లాభపడనున్నారు. చైనా తర్వాత కెనడాలో విద్యనభ్యసించే అధిక మొత్తం విద్యార్థులు భారతీయులే.
2004-2014 సంవత్సరాల మధ్య కాలంలో కెనడాలో విద్యను అభ్యసించడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య 88శాతం పెరిగింది. మొత్తం కెనడా విద్యాసంస్ధల్లో 11శాతం మంది విదేశీయులు చదువుతున్నారు. ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
కెనడా విద్యాసంస్ధల్లో చదువుకున్న విద్యార్థులు దేశ సంస్కృతికి తొందరగా అలవాటు పడతారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్స్ ప్రెస్ ఎంట్రీ సిస్టంను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.