రాజధాని శంకుస్థాపన సభకు 3000 బస్సులు!
ఉద్దండరాయునిపాలెంలో ఈ నెల 22న జరగనున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మొత్తం మూడు వేల బస్సులు.. మరో మూడు వేల వరకు కార్లు.. ఇవి కాకుండా ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం 300 కార్లు, గన్నవరం నుంచి వీఐపీల వినియోగం కోసం 200 ప్రత్యేక వాహనాలు, 10 వోల్వో బస్సులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరమైతే వాహనాల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు నామమాత్రపు ధర చెల్లించి వినియోగించాలని నిర్ణయించింది. సభకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారందరికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
దీంతో వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు అప్పగించారు. దీన్నంతటినీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పర్యవేక్షించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కీలక పనులు ముగింపు దశకు చేరాయి. వేదిక ముస్తాబు, ప్రత్యేక అలంకరణ పనులు మరో రెండు రోజుల్లో మొదలుకానున్నాయి.
నేడు రవాణా శాఖ ఉన్నతాధికారుల సమావేశం...
ఈనెల 22న తుళ్ళూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభ జరగనుంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి 1000 బస్సులు మరో 500 కార్లు సమకూర్చాలని ఆదేశాలు అందాయి. అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వెయ్యి వరకు బస్సులు మరో 300 కార్లు జనసమీకరణ కోసం కేటాయించాలని ఆదేశాలు అందాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాల నుంచి మరో వెయ్యి బస్సులు, వందల సంఖ్యలో వాహనాలను సమకూర్చనున్నారు. దీనిపై శనివారం రవాణా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాల నుంచే భారీగా జనసమీకరణ చేయనున్నారు. రెండు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు, వివిధ ప్రైవేట్ స్కూల్ బస్సులను పూర్తి స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మరో 500 వరకు ఆర్టీసీ బస్సులను కూడా రిజర్వ్‌లో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు.
షెడ్లు ఏర్పాటు..
ఇప్పటికే సభా ప్రాంగణంలో షెడ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 12 లక్షల అడగుల మేర షామియానాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సభకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వెనుక భాగంలో ప్రధాన మంత్రి కోసం రెండు హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. సభకు హాజరయ్యే 30 వేల మంది రైతులకు వేదిక ముందు భాగంలో ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు. కేటగిరీల వారీగా 18 నుంచి పాస్‌లు పంపిణీ చేయనున్నారు. 300 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్ర వారంతో ముగిసింది.
వస్త్రాల అందజేత ...
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర మంత్రులు సంప్రదాయ రీతిలో వస్త్రాలు, స్వీట్ బాక్స్, ఆహ్వానపత్రాలు అందజేసే కార్యక్రమం మండలంలోని నేలపాడు గ్రామంలో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు కలసి వచ్చి కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళకు వాటిని అందజేశారు.