అందరి సంకల్పంతో అమరావతి
♦ స్వగ్రామంలో మట్టి, నీరు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
♦ రాజధానిశంకుస్థాపన విజయవంతం కావాలని పూజలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజలందరి సంకల్పంతో రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎం స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మంగళవారం నిర్వహించిన ‘మన మట్టి- మన నీరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, వేలూరులోని స్వర్ణదేవాలయంతోపాటు, ప్రముఖ దేవాలయాలకు చెందిన వేదపండితులు, అర్చకులు మంగళవాయిద్యాల హోరు నడుమ ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజధాని శంకుస్థాపనకు స్వగ్రామంలోని నాగాలమ్మకు పూజ చేసి పుట్ట మట్టిని, పవిత్ర జలాలను చంద్రబాబు సేకరించారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలని ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 16 వేల గ్రామాల్లో ‘మన నీరు, మన మట్టి, మన రాజధాని అమరావతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు.
దీనికి స్థల బలం, వాస్తు బలం ఉందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం గ్రామాల్లో మట్టి, నీరు సేకరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వీటిని ఊరేగింపుగా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి శంకుస్థాపన ప్రాంతానికి చేర్చాలని పేర్కొన్నారు. నిర్మాణ సంకల్ప పత్రం తయారు చేశామన్నారు. 16 వేల గ్రామాల నుంచి వచ్చే సంకల్ప పత్రాలను భూగర్భంలో భద్రపరుస్తామని తెలిపారు. పవిత్ర జలం, మట్టినీ కలిపి శంకుస్థాపనలో ఉపయోగిస్తామన్నారు. ఓ స్మారక స్థూపం నిర్మిస్తామన్నారు. దీన్ని పవిత్ర స్థలంగా మారుస్తామని పేర్కొన్నారు. అందరూ గర్వంగా చెప్పుకొనే విధంగా రాజధానిని నిర్మిస్తామన్నారు.